తొమ్మిదిన్నరేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వెలిగిపోతున్నది. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదురుకున్నాయి. ఫలితంగా మస్తుగా ఉపాధి దొరుకుతున్నది. పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు అంతా ఇంతా కాదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కోతలే.. కోతలు.. విద్యుత్ లేక వ్యాపారాలు నడువక చిరు వ్యాపారులు అష్టకష్టాలు పడ్డారు. ఇన్వర్టర్లు, జనరేటర్ల కొనుగోళ్లతో అప్పులపాలయ్యారు. పాలకుల చేతకానితనంతో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ప్రకటించేవారు. అప్పుడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త.. సొంత రాష్ట్రంలో ఇంతలా మార్పుకు సీఎం కేసీఆర్ ముందుచూపే కారణం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే పక్కా ప్రణాళికతో 24గంటల పాటు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తుండడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి ఉరకలు వేస్తున్నది.
వరంగల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అప్పుడెట్లుండె తెలంగాణ… ఇప్పుడెట్లయింది తెలంగాణ. తెలంగాణ ఏర్పాటు కాకముందు.. బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేండ్లలో సొంత రాష్ట్రం ఎలా మారిందనే చర్చ అంతటా జరుగుతున్నది. జనం ఎక్కువగా మాట్లాడుకునేది మాత్రం కరెంటు గురించే. తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు సరఫరా అధ్వానంగా ఉండేది. ఊర్లలో రోజుకు నాలుగు గంటల కరెంటు ఇస్తేనే ఎక్కువ. అదీ పొద్దున రెండు గంటలు, రాత్రి రెండు గంటలు. ఇండ్లల్లోనూ ఇదే తీరుగా ఉండేది. కానీ ఇప్పుడు నిత్యం కరెంటు సరఫరా అవుతున్నది. వ్యవసాయానికి సైతం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది. నిర్వహణ లోపాలు, ప్రణాళిక లేమితో దేశంలోని అత్యధిక రాష్ర్టాలు ఇప్పుడు కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నాయి. రోజులో సగం పూట కూడా కరెంటు సరఫరా చేయలేని పరిస్థితిలో చాలా రాష్ర్టాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించడంతో కరెంటు కష్టాలు లేకుండా పోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా నాలుగు, ఆరు, ఎనిమిది, పన్నెండు గంటల వరకు అధికారికంగా కోతలు ఉండేవి. లోడ్ ఎక్కువైందని, నిర్వహణ పనుల కారణాలతో విధించే కరెంటు కోతలు దీనికి అదనం. పరిశ్రమలు, దుకాణాలు, వ్యాపారాలు, సేవల రంగాలపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఉపాధి దొరక్క ఈ రంగంపై ఆధారపడిన వారు ఇబ్బంది పడేవారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు అమ్మే వాళ్లకు తప్ప అన్ని రంగాల వారికి ఉపాధి పరంగా అవస్తలు ఉండేవి. హాస్పిటళ్లకూ కరెంటు సరఫరా నిలిచిపోయేది. ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడేది. హాస్పిటళ్లలో నిరంతరం వైద్య సేవలు అందించాలంటే జనరేటర్లే గతి అయ్యేది. మెడికల్ ల్యాబ్లలోనూ ఇదే తీరు ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు రంగం మొత్తం మారిపోయింది. 24 గంటల కరెంటు సరఫరాతో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమైంది. ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. హాస్పిటళ్లకు నిర్వహణ భారం తగ్గింది. రోగులకు కొంత ఊరట కలుగుతున్నది. నిరంతర కరెంటు సరఫరాతో ప్రభుత్వ హాస్పిటళ్ల వైద్య సేవల్లో గొప్ప మార్పు వచ్చింది.
కరెంటు సరఫరాతో వచ్చిన మార్పులతో వ్యాపార, వాణిజ్యరంగంలో సుస్థిరత ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రం లో పగటిపూట కరెంటు అసలే ఉండేదికాదు. దుకాణాలు, వాణిజ్య కార్యకలాపాల నిర్వాహకులు గిరాకీ ఉంటుందో లేదో అనే ఆందోళనతో ఉండేవారు. కరెం టు లేని సమయంలో తక్కువ గిరాకీ ఉండేది. జనరేట ర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ ఖర్చును తగ్గించేందుకు యజమానులు తక్కువ మందితోనే వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు. దీంతో ఉ పాధి పరంగా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు నిరంతరం కరెంటు సరఫరాతో జనరేటర్ల ఖర్చు తప్పింది. దుకాణాలు తెరిచి ఉంచే సమయం పెరిగింది. వాణి జ్యం ఎక్కువగా సాగుతున్నది. దుకాణాల్లో పని చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కరెంటు సరఫరా చేస్తుండడంతో ఉపాధిపరం గా, వాణిజ్యపరంగా వృద్ధి నమోదవుతున్నది. అందుకే ఇప్పుడు అందరూ అనేది ఒక్కటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఎంతో మారింది. అన్ని రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఉం టే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు కరెంటు పోతేనే దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.