ములుగు, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : చిన్న రాష్ట్రమైనా ప్రగతి పథాన దూసుకుపోతున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా తెలంగాణకంటే పదేళ్ల ముందే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. తెలంగాణ సరిహద్దు గ్రామాలకు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు అభివృద్ధిలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తాలుకా తాళ్లగూడెంలో ‘నమస్తే తెలంగాణ’ బృందం శుక్రవారం పర్యటించింది. అక్కడి పరిస్థితులను తెలంగాణ గ్రామాలతో పోల్చి చూస్తే జమీన్.. ఆస్మాన్ తేడా కనిపించింది. తాళ్లగూడెంలో కుల వృత్తులు లేక.. చేసుకుందామంటే ఉపాధి లేక.. తెలంగాణలోని వాజేడు మండలానికి చెందిన గోదావరి పరీవాహక ప్రాంతంలో మిర్చి తోటల్లో కూలి పనులు చేసేందుకు వలస వస్తూ కనిపించారు. గ్రామం మొత్తం అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు అసలే లేవు. గుంతలు పడిన మట్టిరోడ్లే దిక్కు. బడి బాట పట్టాల్సిన విద్యార్థులు కూలి పనులకు పోతూ కనిపించారు. గిరిజనులు అధికంగా ఉండే ఆ గ్రామంలో ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది లేక.. సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ పరీక్షలు చేసేందుకు ఏఎన్ఎంలు గొడ్లకొట్టం లాంటి షెడ్డులో శిబిరం ఏర్పాటు చేసుకొని ఇబ్బందులు పడుతూ కనిపించారు. సమస్యలపై గ్రామస్తులను కదిలిస్తే 15ఏళ్లపాటు తమ రాష్ర్టాన్ని పాలించిన బీజేపీతోగాని, ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్‌తో గాని ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాలాంటోళ్ల బతుకులు మారాలె
నా బిడ్డను భద్రాద్రి జిల్లా చెర్ల మండలం సీమపాడుకు ఇచ్చి పెండ్లి చేసిన. అక్కడ ప్రభుత్వం పండుగనాడు కొత్త చీరె ఇచ్చిందట. ఆ చీరె నాకు తెచ్చిచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్న చీరె ఇదే.. ఇది బతుకమ్మ పండుగకు ఇచ్చిన్రని చెప్పింది. నా బిడ్డకు నెలలు నిండంగనే నేను అక్కడికే పోయి సర్కారు దవాఖానల కాన్పు చేయించిన. వచ్చేటప్పుడు పెద్ద సూట్‌కేసుల తల్లీపిల్లకు అక్కరకొచ్చే వస్తువులు, బట్టలు ఉచితంగ ఇచ్చి మా అల్లుడి ఇంట్ల దింపిపోయిన్రు. ఆ సూట్‌కేసు మీద ఉన్న సారే ఇప్పుడు ప్రధాని అయితున్నడని నా బిడ్డ చెప్పింది. పేరు కేసీఆర్ అంట కదా. సారు రావాలె.. మా లాంటోళ్ల బతుకులు మారాలె. ఇక్కడ కూడ బతుకమ్మ చీరెలు, కేసీఆర్ సూట్‌కేసు ఇయ్యాలె. – టింగె రమణక్క
మీ ఊళ్లె కల్యాణలక్ష్మి లేదా అన్నరు
నా పెండ్లప్పుడు మా అత్తగారోళ్లు మీ కాడ కల్యాణలక్ష్మి పథకం లేదా అని అడిగిన్రు. మా దగ్గర అసోంటి పథకం లేదని చెప్పిన. నెల కింద కొయ్యూరు దవాఖానల ప్రసవమైనప్పుడు కేసీఆర్ కిట్టు ఇచ్చి అంబులెన్స్‌లో దింపిపోయిన్రు. నేను ఆశ్చర్యపోయి నా భర్తను అడిగిన. ప్రభుత్వమే ఈ కిట్టు ఇస్తదా అనడిగితే అవునని చెప్పిండు. కేసీఆర్ కిట్టు పట్టుకొని అమ్మ వాళ్ల ఊరు తాళ్లగూడెం వచ్చిన. సూట్‌కేసులో ఉన్న వస్తువులు చూసి మా ఇంటి పక్కన వాళ్లు కూడా ఆశ్చర్యపోయిన్రు. తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అయితే ఈ కిట్లు దేశమంత వస్తయని అనుకుంటున్న.
– తెల్లం మనీషా, టింగె రమణక్క కూతురు
దేశమంత రైతు పథకాలు వస్తయ్
తెలంగాణల రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరంట్ ఇస్తున్నరు. మాకు కూడా రావాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నం. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశమంత ఈ పథకాలు కచ్చితంగా వస్తయ్. పంట కొనుగోళ్లతోని మా కాడ దళారులే బాగు పడుతున్నరు. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ లెక్క సర్కారే పంట కొనుగోలు చేస్తదని ఆశపడుతున్నం. మా ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిగా లేవు. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ఉన్న వాజేడు మండలంలోని గ్రామాలతో పోల్చుకుంటే మాకు శానా చిన్నతనమనిపిస్తది. కేసీఆర్ లాంటి నాయకుడు దేశాన్ని నడిపితేనే మాలాంటి గ్రామాలు అభివృద్ధి అయితయ్.
– వాసం రామయ్య
టీవీల్లో చూసి సంబురపడ్డం
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తనని చెప్పిన విషయం టీవీల్లో చూసి ఇగ మా ఊరోళ్ల గోస తీరుతదని సంబురపడ్డం. తాళ్లగూడెంలో రోడ్డు, తాగునీటి సౌకర్యం లేక శాన ఇబ్బందులు పడుతున్నం. మా ఊరిలో కొద్ది మందికే అదికూడా నెలకు రూ.600 మాత్రమే పింఛను వస్తున్నది. తెలంగాణల నెలకు రూ.2వేలు ఇస్తున్నరట. కేసీఆర్ దేశానికి నాయకుడైతే మాకు కూడా వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు వస్తాయని అనుకుంటున్నం. బడులు, దవాఖానలల్ల సిబ్బంది పెరిగి సౌకర్యాలు వస్తయని ఆశ పడుతున్నం.
– వాసం సుధాకర్, నీలం నర్సయ్య, టింగె బతుకయ్య
తాగు, సాగు నీటికీ తండ్లాటే
గ్రామం పక్కనే గోదావరి నది పారుతున్నా సాగునీటికి, తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి వద్ద చెలిమెల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు లేక వర్షాలపై ఆధారపడి పంటలు పండిస్తున్నామని చెప్పారు. పండించిన పంటలను సైతం ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయడం లేదని, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులను అందించడం లేదని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం లేదని వాపోయారు.
సీఎం కేసీఆర్‌లాంటి నాయకుడు కావాలని ఆకాంక్ష
ఏడేళ్లలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ప్రధాని హోదాలో ఉంటే తమ లాంటి గ్రామాలు బాగుపడుతాయని, బాహ్య ప్రపంచానికి తెలుస్తాయని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారి ప్రాంతాల్లో ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎందరు నాయకులు గెలిచినా తమ తలరాతలు మారడం లేదని వాపోయారు. కేసీఆర్ ప్రధాని అయితే రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరంట్ వంటి పథకాలతో పాటు కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు అందుతాయని, మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు మెరుగవుతాయని, విద్య, వైద్యం, సదుపాయాలు, ప్రాజెక్టులు, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని ఆనందపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అప్పుడప్పుడూ టీవీల ద్వారా, తమ గ్రామం నుంచి వాజేడు మండలానికి పోయి వచ్చే వారి ద్వారా, ప్రతి శుక్రవారం జరిగే సంతలో వ్యాపారం నిర్వహించేందుకు వచ్చే వారి ద్వారా తెలుసుకుంటున్నామని తమ రాష్ట్రంలోనూ ఇలాంటి అభివృద్ధి ఉంటే బాగుండు అని ఆశిస్తున్నామని వివరించారు.
ఇక్కడ బతకడానికి ఏమీ లేదు
మాది భూపాలపట్నం తాలూకా తాళ్లగూడెం గ్రామం. పదిహేనేళ్ల కింద ఇప్పటి ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసిన్రు. పదేళ్ల కింద నన్ను నా పెనిమిటి ఇడిశిపెట్టిండు. అప్పటి నుంచి ఇక్కన్నే కూలీనాలి చేసుకుంట బతుకుతున్న. ఇక్కడ బతుకంటే అరిగోస పడాలె.. ఉండేందుకు ఇల్లు లేదు.. బాత్రూము కూడా సరిగా లేదు. ప్రచారానికే స్వచ్ఛభారత్ తప్ప అసలు స్వచ్ఛతే లేదు. ఇక్కడ ఉన్న ఇల్లుజాగ అమ్ముకొని ధర్మారానికి వద్దామనుకుంటున్న. అక్కడుంటే చేతినిండా పని దొరుకుతది. ఒంటరి మహిళ పింఛను వస్తది. మాలాంటోళ్ల జీవితాలు బాగుపడాల్నంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలె. – కీసరి సుశీల