బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో జాతీయ పతాకంతో పాటు గులాబీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఆవిష్కరించారు. అలాగే అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఉద్యమకారులకు సన్మానాలు చేశారు. అనంతరం దవాఖానలు, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలుపెరగని పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పలువురు నేతలు పేర్కొన్నారు.
జనగామ జిల్లాకేంద్రం యశ్వంతాపూర్‌లోని జిల్లా కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ జెండాను, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ అని, అధినేత కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజల సహకారంతో విశేష ప్రగతి సాధించి తెలంగాణను ముందువరుసలో నిలిపిన తీరును వారు గుర్తుచేశారు. హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో జాతీయ జెండాను మండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ జెండాను జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆవిష్కరించారు.
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సాగిన పోరాటంపై బీఆర్ఎస్ రూపొందించిన 30 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్, వరంగల్ లోక్‌సభ అభ్యర్థి సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ఉద్యమకారులను శాలువాతో సన్మానించారు. ములుగులో జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతితో కలిసి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళి అర్పించారు.