గీసుగొండ, సెప్టెంబర్ 11 : మరోసా రి కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైంది. కొమ్మాల గ్రామసభలో కొం డా, రేవూరి వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు విడిపోయారు. రోడ్డుకు నిధుల కేటాయింపుపై చేతులెత్తే విధానంలో కొం డా వర్గీయులు, గ్రామస్తులు వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. గీసుగొండ మండలంలోని కొమ్మాల అంగడి పరిధిలో 5 గ్రామాలు ఉంటా యి. అంగడి వేలం ద్వారా ఈ గ్రామాలకు ఆదా యం సమాకురుతుంది. వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి నుంచి కొమ్మాల అంగడి మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి గ్రామసభ తీర్మానం లేకుండా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఐదు గ్రామాల నిధులు కేటాయించి తన వర్గం వారితో రోడ్డు నిర్మించారు.
గ్రామసభ తీర్మానం కోసం నాలుగు సార్లు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీం తో చిరాకు చెందిన ఎమ్మెల్యే ఏం చేస్తారో తెల్వదు. గ్రా మసభ నిర్వహించి రోడ్డు పనులకు తీర్మానం చేయాల ని హుకుం జారీ చేయడంతో గురువారం గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీవో పాక శ్రీనివాస్, కార్యదర్శి శంకర్రావు గ్రామసభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. గీసుగొండ సీఐ మహేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్సైలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కిం ది.
ఏం జరుగుతుందోని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలకతీంగా తీర్మానాలు చేసిన మళ్లీమళ్లీ గ్రామ సభ ఎందుకు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు నిర్మాణానికి అనుకులమైన వారు ముందుగా చేతులెత్తాలని గ్రామ సభలో ఎంపీడీ వో పాక శ్రీనివాస్ కోరడంతో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి వర్గం వారు మాత్రమే చేతులెత్తారు. అనంతరం వ్యతిరేకించే వారు చేయి ఎత్తాలని కోరడంతో కొండా వర్గానికి చెందిన వారు, బీఆర్ఎస్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేతులెత్తారు. అధికార బలంతో ఎమ్మెల్యే, స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని, గ్రామపంచాయతీ నిధులను గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలని గ్రామస్తులు స్పష్టం చేశారు.