కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో దసరా వేడుకలు మరింత ఆజ్యం పోశాయి. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గొడవకు దారి తీశాయి. కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో లేదని రేవూరి వర్గం గొడవకు దిగింది.
ఫలితంగా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ దాడికి దారితీసి పోలీస్ స్టేషన్‌కు చేరింది. తమ అనుచరులను అరెస్ట్ చేసి కొడతారా? అంటూ మంత్రి సురేఖ పోలీస్ స్టేషన్‌కు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ కుర్చీలో కూర్చొని బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా హామీతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
– గీసుగొండ, అక్టోబర్ 13డివిజన్ ధర్మారంలో శనివారం దసరా ఉత్సవాలను
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా వర్గీయులుగా చెలామణి అవుతున్న బండి రాజ్‌కుమార్, ముస్కు సురేశ్, కూస రాజ్‌కుమార్, చౌడు శివప్రసాద్, ముస్కు రాజుకుమార్, చుంచు రాజు, మహేశ్వర్, వంశీ మంత్రి సురేఖ, మురళీధర్‌రావు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయులు పిట్టల అనిల్, పిట్టల భాను ఎమ్మెల్యే ఫొటో ఎందుకు పెట్టలేదని గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
స్థానికులు కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపజేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికే కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫెక్సీలను చించివేయటంతో పిట్టల అనిల్,భానుపై దాడిచేసి చితకబాదారు. గాయాలపాలైన పిట్టల అనిల్‌ను ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. ఆ సమయంలో గ్రామంలో మళ్లీ గొడవలు కాకుండా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం అనిల్, భాను కొండా వర్గీయులైన ఎనిమిది మందిపై గీసుగొండ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో బండి రాజ్‌కుమార్, ముస్కు సురేశ్, కూస రాజ్‌కుమార్, చౌడు శివప్రసాద్, ముస్కు రాజ్‌కుమార్, చుంచు రాజును పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టారు. అందులో ముగ్గురు భవాని మాల వేసుకున్నారని, వారిని వదిలిపెట్టాలని కొండా వర్గానికి చెందిన గోపాల నవీన్‌రావు కోరారు. అయినా వినకుండా వారిని స్టేషన్లోనే ఉంచటంతో ఈ విషయాన్ని మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సురేఖ డీసీపీ రవీందర్, మామునూరు ఏసీపీ తిరుపతికి ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో మంత్రి సూచన మేరకు ఆమె వర్గీయులు ఎల్ రాజు, క్రాంతికుమార్, వంశీ, రంజిత్ ఆధ్వర్యంలో ధర్మారంలో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న గీసుగొండ సీఐ మహేందర్, మామునూరు ఏసీపీ తిరుపతి అక్కడికి చేరుకొని అనుమతి లేకుండా ధర్నా చేస్తే కేసులు పెడతామని హెచ్చరించడంతో వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు మాట వినడం లేదని ఆగ్రహించిన మంత్రి కొండా సురేఖ గీసుగొండకు బయల్దేరారు. ధర్మారం వద్ద ధర్నా చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి కాన్వాయ్ దిగి నడుచుకుంటూ ధర్నా చేస్తున్న వారి వద్దకు చేరుకున్నారు. వారితో కలిసి ఆటోలో గీసుగొండ పోలీస్‌ష్టేషన్‌కు వెళ్లారు. తన వర్గీయులను పోలీసులు కొట్టిన దెబ్బలు చూసి ఆవేశంతో ఉగిపోయిన మంత్రి సురేఖ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
వారి కష్టంతోనే పరకాలలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గెలిచాడని గొడవకు దిగారు. గాయాలైన పిట్టల అనిల్‌ను స్టేషన్‌కు తీసుకొని రావాలని పట్టుబట్టారు. అలాగే తమ వారిపై దాడి చేసిన డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి, సీఐ మహేందర్‌ను బదిలీ చేసి వారిపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడే ఉంటానని పోలీస్ష్టేషన్లో కూర్చున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ మంత్రికి చెప్పినా ఆమె అక్కడే ఉండడంతో కొండా వర్గీయులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఘా గీసుగొండ పోలీస్‌ష్టేషన్‌కు వచ్చి మంత్రి సురేఖతో మాట్లాడారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చిన మంత్రి సురేఖతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు యత్నించగా ఆమె చెప్పేదేమీ లేదంటూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కొండా వర్గీయులు ‘పోలీసులు డౌన్.. డౌన్.. న్యాయాన్ని రక్షించాలి’ అంటూ నినాదాలు చేసినా పోలీసులు ఏమీ చేయలేక చూస్తుండిపోయారు.
మంత్రి కొండా సురేఖ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి కనీస ఆలోచన లేకుండా పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో కూర్చున్నారు. ఏసీపీ, సీఐ మంత్రి ముందు నిలబడి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. డీసీపీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే .. మంత్రి మాత్రం సీఐ కుర్చీలో కూర్చొని పోలీసులపై పెత్తనం చేయడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు.