సంగెం, మార్చి 31 : సిగరెట్ పొగ యువకుడి ప్రాణం తీసిన ఘటన సంగెం మండలంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుం టపల్లి గ్రామానికి చెందిన చిర్ర పూల కుమారుడు బన్ని(21) డిగ్రీ చదువుతూ వరంగల్ హంటర్ రోడ్డులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. ఈ నెల 30వ తేదీ ఉగాది నాడు గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య జాతరకు చిర్ర పూల, ఆమె కూతురు పూజిత, పెద్ద కుమారుడు ధని (శివ) కలిసి ఒక బైక్‌పై, చిన్న కుమారుడు బన్ని, తన స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఒక బైక్ తీసుకుని వచ్చారు.
ఆ తర్వాత తల్లి, సోదరి, సోదరుడు తిరిగి కుంటపల్లికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెనుక వైపు రాంచంద్రాపురం రోడ్డులో తన స్నేహితుడితో కలిసి బన్ని సిగరెట్ తాగుతున్నాడు. అక్కడే ఉన్న గవిచర్ల గ్రామానికి చెందిన వేల్పుల సిద్ధు పొగ వస్తుందని, దూరం వెళ్లి తాగమని హెచ్చరించగా, బన్ని ఇక్కడే తాగుతా నువ్వే ఇక్కడి నుంచి పో అని అనడంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న బన్ని స్నేహితుడు ధని(శివ)కు ఫోన్ చేయగా, అతడు వచ్చి ఇద్దరిని సముదాయించాడు.
అలాగే సిద్ధు సోద రుడు వినయ్ వచ్చి తమ్ముడి తరఫున క్షమాపణ చెప్పాడు. సిద్ధు మాత్రం బన్నిపై పగ పెంచుకుని సంగెంలోని తన మేమమామలకు ఫోన్ చేసి గొడవ గురించి చెప్పాడు. దీంతో అతని మేనమామలు, తాత 8 మంది కలిసి ఆటోలో వచ్చి బన్ని, ధని, గిరిబాబుపై పిడిగుద్దులు గుద్దారు. బన్నిని టార్గెట్ చేసి మెడపై, ఛాతిపై కొట్టడంతో కిందపడి పోయాడు. వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు బన్నీకి సీపీఆర్ చేసి 108 అంబులెన్స్‌లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. బన్నీని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని చెప్పారు.
9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
బన్నీని చంపిన కేసులో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగెంకు చెందిన గుండేటి సునీల్, గుండేటి మహేందర్(ధోని), గుండేటి కార్తీక్, గుండేటి రాజు, గుండేటి రాజ్‌కుమార్, మిట్టపెల్లి భరత్, గుండేటి కొమ్మాలు, వేల్పుల సిద్దు, మిట్టపల్లి భరత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజగోపాల్ తెలిపారు. పరారీలో ఉన్న వారిని వెతుకుతున్నట్లు చెప్పారు. బన్ని మృతదేహంతో సంగెం నుంచి కుంటపల్లి వరకు మోటర్ ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంగెం ఎస్సై నరేశ్ బందోబస్త్ నిర్వహించారు.