చిట్యాల, జూలై 13 : గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) వైద్య సేవలతో వర్ధిల్లింది. అవసరమైన డాక్టర్లతో రోగులు, గర్భిణులకు నాణ్యమైన వైద్యం అందించి అవార్డులు, రివార్డులు పొందింది. చిట్యాల పరిసర ప్రజలకే కాకుండా సుదూర ప్రాంతాలైన ఏటూరునాగారం, పెద్దపల్లి, జమ్మికుంట, పరకాల నుంచి వచ్చే గర్భిణులకు పురుడు పోసింది.
బాలింతలకు పది రోజులపాటు అన్నం పెట్టి, పుట్టిన బిడ్డకు పిల్లల వైద్య నిపుణుడితో వైద్యం అందించి కేసీఆర్ కిట్టుతో సాగనంపింది. అంతేకాకుండా బిడ్డ కడుపుల పడినప్పటి నుంచి పౌష్టికాహారంతో కూడిన న్యూట్రిషన్ కిట్లను అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిట్యాల సీహెచ్సీలో వైద్యం అందని ద్రాక్షగా మారగా రోగులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుత ఆస్పత్రి దుస్థితి..
సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న చిట్యాల దవాఖానలో 18 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆరుగురు మాత్రమే ఉండగా అందులో నలుగురు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను పరీక్షించే గైనకాలజిస్టు లేకపోవడం గమనార్హం. దీంతో వైద్య సేవలందించలేక దవాఖాన చిన్నబోతున్నది. గత ప్రభుత్వం సరఫరా చేసిన కేసీఆర్ కిట్లను బాలింతలకు అందజేయకుండా దవాఖానలోని ఓ రూములో మూలన పడేశారు.
ఇది దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు కొత్త ప్రభుత్వ కక్షపూరిత చర్యగా స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందకపోవడంతో గర్భిణులు కాన్పులకు రాక వారి కోసం ఏర్పాటు చేసిన ప్రసూతి వార్డు వెలవెలబోతున్నది. ఆపరేషన్ థియేటర్, చిల్డ్రన్స్ కేర్ వార్డులు తాళాలతో దర్శనమిస్తున్నాయి. అలాగే సీహెచ్సీలో వైద్య పరికరాలున్నప్పటికీ రోగులను భూపాలపల్లి, వరంగల్ ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేస్తూ డాక్టర్లు చేతులు దులుపుకుంటున్నరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దవాఖాన డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మూడు నెలల క్రితం సమీక్ష నిర్వహించి వైద్యుల కొరత లేకుండా చూస్తామని, సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. అయినప్పటికీ సీహెచ్సీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి సీహెచ్సీకి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
దవాఖాన వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వైద్యుల కొరతను నివారించేందుకు త్వరలోనే చర్యలు చేపడతాం. ఉన్న వైద్యులు, సిబ్బందితో రోగులకు మెరుగైన సేవందించేందుకు కృషి చేస్తున్నాం. గైనకాలజిస్టులు లేకపోవడం వల్లే ప్రసూతి సేవలు అందించలేకపోతున్నాం. నూతన వైద్యులను తీసుకొచ్చేందుకు మా వంతు గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం.
– డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్, సీహెచ్సీ, చిట్యాల