ఏటూరునాగారం, మార్చి 3 : ఐటీడీఏ చరిత్రలో తొలిసారి మహిళా ఐఏఎస్ పీవోగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 12న జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ఏటూరునాగారం పీవోగా చిత్రామిశ్రా బదిలీపై వచ్చారు. ఇక్కడ పీవోగా అంకిత్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేయగా అక్కడ అదనపు కలెక్టర్‌గా ఉన్న 2019 బ్యాచ్‌కు చెందిన చిత్రామిశ్రాను ఏటూరునాగారం ఐటీడీఏకు బదిలీ చేశారు. అయితే అదే సమయంలో మేడారం జాతర జరుగుతున్న కారణంగా అంకిత్ జాతర పూర్తయ్యే వరకు కొనసాగారు. జాతర ముగిసిన తర్వాత వారం రోజుల పాటు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏఆర్వో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. చిత్రామిశ్రా సోమవారం పీవోగా ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
69మంది పీవోల తర్వాత రెగ్యులర్ పీవోగా మహిళా ఐఏఎస్ అధికారికి పనిచేసే అవకాశం దక్కింది. 1975లో ఐటీడీఏను ప్రభుత్వం నెలకొల్పింది. అదే ఏడాది జూలై 4న ఐఏఎస్ అధికారి ఎంవీ రంగారెడ్డిని తొలి పీవోగా నియమించారు. అప్పటినుంచి ఐటీడీఏ కార్యకలాపాలు మొదలయ్యాయి. ముందుగా వరంగల్ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసినా తర్వాత ఏటూరునాగారానికి మార్చారు. సుమారు 49 సంవత్సరాలుగా గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ పనిచేస్తున్నది. కాగా, ఇప్పటివరకు 69 మంది ఐఏఎస్, నాన్ ఐఏఎస్‌లు పీవోలుగా పనిచేశారు.
ఇందులో రెగ్యులర్ మహిళా ఐఏఎస్‌ను పీవోగా నియమించడం ఇదే తొలిసారి. 2007 ఫిబ్రవరి 2న నాన్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన సుందర్ అబ్నార్‌ను పీవోగా నియమించారు. ఆయన 2010 సెప్టెంబర్ వరకు పనిచేశారు. అయన ఇక్కడ నుంచి బదిలీ కాగానే ములుగు ఆర్డీవోగా పనిచేస్తున్న శివారెడ్డికి ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పుడు జరిగిన ఓ ఘటనపై ఆ అధికారిని నాలుగు నెలలకే తొలగించారు.
అత్యవసరంగా ఐటీడీఏకు పీవోను నియమించాల్సి ఉండగా వరంగల్ డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సుజాతశర్మకు రెండు నెలల పాటు అదనపు బాధ్యతలు అప్పగించారు.ఇక ఐటీడీఏ చరిత్రలో ఒక్క మహిళా అధికారి రెగ్యులర్ పీవోగా పనిచేసిన దాఖలాలు లేవు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధి అతిపెద్దగా విస్తరించబడి ఉండడంతో మహిళా అధికారులను పీవోగా నియమించడం లేదని భావించేవారు. ఇప్పటివరకు ఐటీడీఏలో 69మంది పీవోలు పనిచేశారు. ఇందులో రెగ్యులర్ పీవోగా పనిచేసిన మహిళలు లేనే లేరు. ఒక్క రెండు నెలలు మాత్రం సుజాతశర్మ అదనపు బాధ్యతలతో పనిచేశారు. ఇక 70వ పీవోగా చిత్రామిశ్రాను నియమించారు.