నర్సంపేట, డిసెంబర్ 31 : మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. తేజ రకం మిర్చిని రైతుల కల్లాల వద్దే కొనుగోలు చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తేజ రకం మిర్చి కొనుగోలును ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడానికి సన్నహాలు చేస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మిర్చిని మార్కెట్‌కు తరలించే అదనపు శ్రమ, ఖర్చును తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో రైతుల కల్లాల వద్దనే గ్రేడింగ్ ఆధారంగా కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.
వరంగల్‌లోని గ్రెయిన్ మార్కెట్లోని అయిదు రోజుల ముందు ధరలను ప్రమాణికంగా తీసుకుని సరాసరి లెక్కించి ధర నిర్ణయిస్తారన్నారు. ఇప్పటికే సిబ్బంది తేజ మిర్చిని పండించిన రైతుల వివరాలను సేకరించారని తెలిపారు. కాంటాలు అయిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశయం ప్రకారం సెర్ప్ ఆధ్వర్యంలో పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి నేరుగా వినియోగదారులకు అందించినప్పుడే రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.