వరంగల్, మే 19 : గ్రేటర్ వరంగల్ పరిధిలోని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. శుక్రవారం కుడా కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి బల్దియా, కుడా, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో రూ.5 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియాలు, వరద ముంపు నివారణ, ఎస్టీపీలు, జంక్షన్ల అభివృద్ధి, డక్ట్లు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ అంశాలపై చర్చించారు. కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి ఆలయ మాడవీధులు, వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణం, మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ, స్మార్ట్‌సిటీ పనులపై దిశానిర్ద్ధేశం చేశారు.
గ్రేటర్ పరిధిలో ప్రతి రోజూ తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు రూ. 10 కోట్లతో చేపట్టిన స్లీవ్స్ వాల్వ్, పైన్‌లైన్ల మార్పిడి, ఫీడర్ ట్రంక్ ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫ్లో మీటర్లను ఏర్పాటు చేసి చివరి ఇంటి వరకు తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న 51 కాలనీలకు మిషన్ భగీరథ రెండో విడుతలో నీరంందించాలని ఆదేశించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందిస్తూ తాగునీటి సరఫరా నిర్వహణలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. న్యాక్ ద్వారా 125 మంది సిబ్బందిని త్వరగా నియమించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ముంపు నివారణ నిధులను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరయ్యేలా చూడాలని కోరారు.
రాబోయే వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం ముంపునకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను అరవింద్ కుమార్ ఆదేశించారు. వర్షాకాలానికి ముందే నాలాల పూడికతీత పనులను పూర్తి చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు నివారణకు రూ. 234 కోట్లతో చేపడుతున్న రిటైనింగ్ వాల్స్, డక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, డీఆర్ఎఫ్ టీంలు సమన్వయంతో పని చేయాలన్నారు. నగరంలోని ఒక్క కాలనీ కూడా వరద ముంపునకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు.
రూ. 75కోట్లతో నిర్మించనున్న మోడల్ వరంగల్ బస్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలో బస్‌స్టేషన్‌కు భూమి పూజకు సిద్ధం చేయాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నెలలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియాల టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కాజీపేట ప్రధాన చౌరస్తాను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్లో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిత్యం రద్దీగా ఉండే కాజీపేట రైల్వే జంక్షన్ కూడలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆరవింద్కుమార్కు చీఫ్ విప్ వివరించారు. పశ్చిమ నియోజవర్గంలోని సుమారు 10 జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. అరవింద్ కుమార్ స్పందిస్తూ కాజీపేటతో పాటు నియోజవర్గంలోని అన్ని జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ఆగస్టు 15 నాటికి కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికులు, మెటీరియల్ పెంచుకొని పనులను వేగంవంతం చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనుల్లో వేగం పెంచాలన్నారు.