జనగామ, (నమస్తే తెలంగాణ) జనవరి 3 : కోడి మాంసం, కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. పది రోజుల క్రితం కిలో స్కిన్ చికెన్ రూ. 240, స్కిన్లెస్ రూ. 260 ఉండగా.. ప్రస్తుతం రూ.260, రూ.290 చొప్పున అమ్ముతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 500కు పైగా ఉన్న బ్రాయిలర్, పౌల్ట్రీ ఫామ్‌ల్లో 30 నుంచి 50 లక్షల కోళ్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా, 25 నుంచి 30 లక్షలకు పడిపోయింది. అలా ప్రతిరోజూ 80 లక్షల గుడ్లు ఉత్పత్తి కావాల్సి ఉంది. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో పాటు పొగమంచు, చలి తీవ్రతతో వ్యాధులు సోకి కోళ్లు మృత్యువాత పడడం, గుడ్ల ఉత్పత్తి సైతం 60 లక్షలకు పడిపోయింది.
ఇందులో రూ. 25లక్షల నుంచి రూ. 30లక్షల వరకు కోడి గుడ్లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు ఎగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో కోళ్లు, గుడ్లకు కొరత ఏర్పడడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికితోడు దాణా ధరలు, నిర్వహణ ఖర్చు కూడా పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం గుడ్డు ధర రూ. 6 ఉంటే క్రమంగా పెరుగుతూ రూ.7.50కు చేరింది.
వారం, పదిరోజులుగా గుడ్డు హోల్‌సేల్ ధర రూ. 7 ఉండగా, రిటైల్‌లో మాత్రం రూ. 8కి అమ్ముతున్నారు. కోళ్లు, కోడి గుడ్ల అమ్మకాల్లో హోల్ సేల్కు, రిటైల్‌కు వ్యత్యాసం ఉండడంతో ఎప్పుడు ధరలు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో కిలో చికెన్ ధర రూ.300 దాటే అవకాశం ఉందని, ఒక్కో కోడి గుడ్డు ధర కూడా రూ.10 కావచ్చని అంటున్నారు. ఈ నెలలోనే మేడారం మహాజాతరతోపాటు పలుచోట్ల మినీ జాతరలు ఉండటంతో కోళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అమాంతం పెరిగిన కోడి మాంసం, గుడ్ల ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది.