ఖిలావరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో గత వారం రోజులుగా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అవినీతి కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చెరిపల్లి ఆనంద్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేశారు. కాట్రపల్లి గ్రామానికి చెందిన గిరుక సురేష్ అనే వ్యక్తి పేరుతో డీడీలు తీసీ రైతుల పంట పొలాల్లో పోయాల్సిన మట్టిని కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెలామణి అవుతున్న సురేష్‌నాయక్ మట్టిని విక్రయించి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని, అనుమతి ఇచ్చిన తహసీల్ధార్, మైనర్ ఇరిగేషన్ అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో విముక్త చిరుతల పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నల రవికుమార్, కార్యదర్శి చేతరాజు సుమన్‌బాబు తదితరులున్నారు.