దంతాలపల్లి, మార్చి 13 : మండలంలోని పాలేరు వాగులో చెక్ డ్యాంలు ఎండిపోతున్నాయి. యాసంగి తొలి దశలో చెరువులు, కుంటలు, వాగులు కళకళలాడి బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి, మక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు సాగు చేశారు. గత ప్రభుత్వం అందించిన మాదిరిగానే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తదనే ధీమాతో రైతు బంధు ఇవ్వకపోయినా కూడా అప్పులు చేసి పంటలు వేశారు.
కాంగ్రెస్ సర్కారు ఎస్సారెస్పీ జాలాలతో పాలేరు వాగు, చెరువులు, కుంటలు నింపుక పోవడంతో బావులు, బోర్లు అడుగంటి రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తూర్పుతండాకు చెందిన రైతు గుగులోత్ రాంధాన్ పంటలకు సాగునీరు లేక నాలుగు బోర్లు ఒక్కొక్కటి వెయ్యి ఫీట్ల లోతు వేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కుమ్మరికుంట్లలో రైతు తండా రాములు బోరులో నీళ్లు ఎల్లక మూడెకరాల వరిలో పశువులు మేపుతున్నాడు. ఇలా ఈ గ్రామంలోనే కాదు ఎక్కడ చూసినా రైతులు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నారు.