వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో శనివారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. రామన్నపేటకు చెందిన బాధితురాలు రేకులపల్లి నరసమ్మ (78)తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సుమారు మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి తలుపుతట్టాడు.
ఎవరని ప్రశ్నించగా రాజును మాట్లాడుతున్నానని బదులిచ్చారని దాంతో తలుపు తెరిచిన వెంటనే తన మెడలోవున్న సుమారు నాలుగు లక్షల విలువ కలిగిన 40 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరుగులు తీశాడని, అడ్డుపడే ప్రయత్నం జరిగిన తోపులాటలో తనకు గాయం కావడంతో నిలువరించలేక పోయానని తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక మట్టెవాడ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుండి వివరాలు నమోదు చేసుకొని, పంచనామ నిర్వహించి విచారణ చేపట్టారు.
చైన్ స్నాచింగ్ జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఉండటంతో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలే పరిస్థితులు ఇలా ఉంటే, ఇక నగర శివారు పరిస్థితులులా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిత్యం పెట్రోలింగ్ పెంచాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.