వరంగల్ చౌరస్తా, జనవరి 21: రైతుల పోరాటంతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని అబ్బనికుంటలోని తెలంగాణ రైతుభవన్లో రైతుసంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో వ్యవసాయరంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించినా ఆచరణలో అమలు కావడంలేదన్నా రు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఈ విషయమై రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్లకార్డులతో ఆం దోళన నిర్వహిస్తామని సోమిడి శ్రీనివాస్ తెలిపారు.
గణతం త్ర దినోత్సవం రోజు న వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. మరోవైపు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచర్ల బాలరాజు, పెద్దారపు రమేశ్, వల్లందాసు కుమార్, ఓదెల రాజన్న, ఐలయ్య, సుంచు జగదీశ్వర్, బోళ్ల ఎల్లయ్య, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.