ఏటూరునాగారం, మే 27 : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌కు సమీపంలో గోదావరి కరకట్టపై ఉన్న తూము షట్టర్ల ఆప్రాన్ (రక్షణ కోసం నిర్మించే సిమెంట్ కట్టడం) గత ఏడాది వచ్చిన వరదలకు ఒడ్డు కోతకు గురై ధ్వంసమైంది. దీంతో పాటు ఇరువైపులా నిర్మించిన కాంక్రీట్ వాల్ కూడా ముక్కలైంది. వర్షాలు కురిసినపుడు రామన్నగూడెంలో నిలిచే నీళ్లు గోదావరిలోకి మళ్లించేందుకు తూముల నిర్మాణం చేపట్టారు. వరద ప్రవాహానికి షట్టర్లు, తూములు కొట్టుకుపోకుండా ఉండేందుకు బెడ్ తరహాలో నిర్మించిన ఆప్రాన్ ధ్వంసం కాగా దాని మరమ్మతును అధికారులు పట్టించుకోవడం లేదు.
అయితే మరో వారం, పది రోజుల్లో వానకాలం ప్రారంభం కానుండగా, ఇక్కడ పనులు చేపట్టడం అసాధ్యం. వేసవిలోనే వీటి రిపేర్లు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే తూముల పైభాగంలో ఉన్న ఒడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోగా, మళ్లీ వరదలు వస్తే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రామన్నగూడెం గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తూము షట్టర్లకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
