వరంగల్ చౌరస్తా: కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ పీజీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆసిస్టెంట్ ప్రొఫెసర్‌పై అంతర్గత విచారణ జరుగుతున్న విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో కాకతీయ మెడికల్ కళాశాల మరో మారు వార్తల్లో నిలిచింది. ర్యాగింగ్ కారణంగా డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తనను తన తోటి విద్యార్థుల ముందు అసభ్యకరంగా అభివర్ణిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నాడని సైకియాట్రి పీజీ విద్యార్థిని కేఎంసీ ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విచారణ చేపట్టి, నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ నిమిత్తం సమావేశమైన ముగ్గురు మహిళా ప్రొఫెసర్లు, ఇద్దరు ప్రొఫెసర్ల కమిటీ సభ్యులు మూడు రోజుల క్రితం బాధిత యువతితో పాటుగా సైకియాట్రి విభాగం పీజీ విద్యార్థులను ప్రాథమికంగా విచారించింది.
గురువారం ఉదయం బాధితురాలితో పాటుగా పీజీ విద్యార్థులను పూర్తిస్థాయిలో విచారించిన కమిటీ సాయంత్రం సమయానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సైతం విచారించి, విచారణ పూర్తి వివరాలను క్రోడీకరించి కమిటీ నివేదికను కేఎంసీ ప్రిన్సిపాలక్కు అందజేయనున్నట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య తెలిపారు.