హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 26 : ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే 765 డీజీ జాతీ య రహదారిపై బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ విషయం పోలీసులకు కూడా తెలియకపోవడం విశేషం. 20 ఎడ్లబండ్ల ముందు ద్విచక్ర వాహనాలపై ఎస్కార్ట్‌గా వెళ్తున్న యువకులు అరుపులు, ఈలలు, చప్పట్లతో వెళ్తుండడంతో ఎదురుగా వస్తున్న వాహనదారులు బెంబేలెత్తి పక్కకు జరిగారు. ఈ క్రమంలో ఓ ఆటోను వేగంగా వచ్చిన ఎడ్లబండి అదుపు తప్పి ఢీకొట్టగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో దారి పొడవునా ప్రయాణికులు, వాకర్స్ ఇబ్బంది పడ్డారు.
అయితే రెండు పోలీస్ స్టేషన్లలోని కొందరు సిబ్బందికి ముందుగానే నిర్వాహకులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ పందేలను కొద్దిరోజులుగా కమలాపూర్ నుంచి అదే మండలం శనిగరం వరకు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడడంతో అక్కడి పోలీసులు పోటీలకు నిరాకరించడంతో ఎల్కతుర్తి నుంచి కొత్తపల్లి వరకు పందేలు నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో కమలాపూర్ మండలం గుండేడు, కానిపర్తి, ధర్మసాగర్ మండలం దేవునూరు, భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలం దండేపల్లి, హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన యువ రైతులు ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది.
ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్
ఈ ఎడ్లబండ్ల పోటీల కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో సభ్యత్వం పొందాలనుకునే వారు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. అందు లో పోటీలు నిర్వహించే తేదీ, సమయం, స్థలం తదితర వివరాలను నిర్ధారించుకుంటారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు నగదు రూపంలో అందజేస్తున్నట్లు తెలిసింది. దీంతో కొందరు యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎడ్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.