గిర్మాజీపేట, నవంబర్ 9: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అని, ఇక రాష్ట్రంలో అభివృద్ధిని మర్చిపోవాల్సిందేనని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనతో కలిసి పాతబీట్బజార్ వర్తక, వాణిజ్య సముదాయాల వద్ద, పిన్నవారివీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ 11 పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని, దాన్నిచూసి ఓర్వలేక కల్లబొల్లి మాటలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రజలు గమనించాలని నన్నపునేని కోరారు. బీజేపీ దేశంలో మతకల్లోలాలు సృష్టించి.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ఆగం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. తాను బీట్‌బజార్‌లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరికీ నాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకొచ్చిందన్నారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని మద్దతు తెలుపడం ఆనందంగా ఉందన్నారు. తొడలు కొట్టి, మీసాలు తిప్పేవాళ్లను నమ్మితే ఆగమైపోతామని తెలిపారు. కాంగ్రెసోళ్లు ఆజాంజాహీ మిల్లు అమ్ముకొని, దానిపై ఆధాపడిన వాళ్లను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంగెం మండలంలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తనను అధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యానియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అలీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమికి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కొలిపాక శ్రీనాథ్, రవి, బాగల్ కల్యాణ్, నాయకులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ: తూర్పులోని కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. 19వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా కార్మికులు మార్కెట్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 ఏళ్ల నుంచి 57 ఏళ్లలోపు మహిళా కార్మికులందరికీ కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకాల ద్వారా నెలకు రూ. 3 వేల భృతి అందిస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక నాయకుడు రాజబోయిన యాకయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
వరంగల్‌చౌరస్తా: వరంగల్ 36వ డివిజన్ చింతల్లో నన్నపునేని నిర్వహించిన ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై ఏమాత్రం అవగాహన లేని ప్యారాచూట్ నాయకులను రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. చింతల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, మైనార్టీ నాయకులు మసూద్, డివిజన్ అధ్యక్షులు వేల్పుగొండ యాకయ్య, మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత, డివిజన్ ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్పీఆర్ నగర్‌కు చెందిన సీపీఎం సీనియర్ నేత అక్కినపల్లి యాదగిరి, 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక శ్రీధర్ ఎమ్మెల్యే నరేందర్ సమక్షలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, సోల రవి, రాజ్ పటేల్, భద్రయ్య, కాలనీ అధ్యక్షుడు తరిగొప్పుల శంకర్,గౌరవ అధ్యక్షుడు కొలిపాక శ్రీను, ఎరుకల రవి పాల్గొన్నారు.
కరీమాబాద్: అన్నా.. గెలుపు మనదే అంటూ బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు మాజీ కార్పొరేటర్ కేడల పద్మ వీరతిలకం దిద్దారు. గురువారం రంగశాయిపేటలోని ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ నివాసానికి నరేందర్ వెళ్లారు. దీంతో పద్మ ఆయనకు వీరతిలకం దిద్దారు.