నెక్కొండ మే 21: నెక్కొండ మండలంలోని అమీన్పేటలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు చిలుకూరు సారమ్మకు చెందిన పాడి బర్రె మృత్యువాత పడింది. బర్రె మృతితో సుమారు రూ.70000 నష్టపోయామని, తమని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు. కాగా, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర కర్నాటక-గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపైనున్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.