బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఇది బ్రూసిల్లా అబార్టస్ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ సూక్ష్మజీవులు పశువుల జన నేంద్రియాలు, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. వీటితో సూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి పశువుల ద్వారా మనుషులకు అంటుకుంటుంది. దీంతో పురుషుల్లో వృషణాల వాపుతోపాటు నపుంసకత్వం రావచ్చు. మహిళ లకైతే అబార్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణకు సమర్థవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, రైతులందరూ 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు వీటిని వేయించాలని పశు వైద్యులు సూచిస్తున్నారు.
– హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి9
పశు సంపదకు బ్రూసెల్లోసిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారింది. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది పశువులకు వస్తుంది. దీన్ని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి పశువుల ద్వారా మనుషులకు సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల్లో వాపు రావడంతో పాటు నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. ఈ వ్యాధిపై రైతులు ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోకపోతే పశు సంపద పెరుగుదలకు అవరోధంగా మారునుంది. నిర్లక్ష్యం చేస్తే మేకలు, గొర్రెలు, పందులకు కూడా అంటుకుంటుంది.
పశువులు 5 నుంచి 9 నెలల సూడితో ఉన్నప్పుడు ఈడ్చుకుపోతాయి. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. జ్వరం వస్తుంది. కీళ్ల వాపులు, నొప్పులు, మగ పశువుల్లోనైతే వృషణాల వాపుతో పాటు వంధ్యత్వానికి గురవుతాయి. గర్భాశయ సంబంధ సమస్యలు రావడంతో పాటు మాయి వేయక పోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. లోపల పిండం మొత్తం కడుపులోనే కుళ్లిపోతుంది.
ఈ వ్యాధికి సంబంధించిన సూక్ష్మజీవులు పశువు నోటి, కంటి, చర్మం, పొదుగు ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువుతో సంభోగం చేసిన మగ పశువులకు అంటుకుంటుంది. వాటి ద్వారా ఇతర పశువులకు పాకుతుంది. ఆడ పశువు గర్భకోశం నుంచి స్రవించే మట్టు ద్వారా కూడా వస్తుంది. పశువుల కాపరులు, సంరక్షులకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి.
ఈ వ్యాధి సోకితే మెరుగైన చికిత్స మాత్రం లేదు. ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమం(ఎన్ఏడీసీపీ)లో భాగంగా అన్ని ప్రభుత్వ పశువైద్యశాలల్లో వీటిని ఉచితంగానే వేస్తారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో 9830 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. పశువు ఈడ్చుకుపోయినప్పుడు దాని పిండాన్ని, మాయను, గర్భాశయ ద్రవాలు, ఇతర చెత్తను దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. ఆ పశువును మంద నుంచి శాశ్వతంగా దూరంగా ఉంచితేనే మంచిది. టీకా వేయించినట్లయితే శాశ్వతంగా ఈ వ్యాధి రాదు. దీని ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించడంతో పాటు పశు సంపద వృద్ధికి దోహదపడుతుంది.
ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు పశువుల్లో కనిపించినట్లయితే దీనికి ప్రత్యేక నిర్ధారణ పరీక్షలు చేయించాలి. ముందుగా పాల రంగు పరీక్ష(ఎంఆర్టీ) చేయాలి. లేదంటే రాపిడ్ ప్టేట్ అగ్లూటినేషన్ టెస్ట్(ఆర్పాఏటీ) చేయించాల్సి ఉంటుంది.
అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి పట్ల పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి నివారణకు ఇప్పుడు సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చింది. దీన్ని రైతులందరూ దూడలకు వేయించుకోవాలి. అన్ని పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ వెంకటనారాయణ, జిల్లా పశువైద్యాధికారి
బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి కేవలం పశువులకే కాదు, మనుషులకు సైతం ప్రమాదకరంగానే మారింది. పశువులకు సేవ చేసే వారు, వ్యాక్సిన్ వేసే సిబ్బంది సైతం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు పూర్తి స్థాయిలో సహకరిస్తేనే ఈ వ్యాధిని 100 శాతం నిర్మూలించే అవకాశాలున్నాయి.
– డాక్టర్ నాగమణి, ఏడీ, పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం, వరంగల్