హనుమకొండ చౌరస్తా, జూన్ 1 : కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కేయూ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం తొలగించడం ఈ ప్రాంత ప్రజలను అవమానించడమేనని, కళా తోరణానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, చరిత్ర తెలియకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ మీద ద్వేషంతో ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే అవివేకంతో కాకతీయ తోరణం జోలికి వస్తే, యూనివర్సిటీ వేదికగా ఉద్యమం చేస్తామని స్పష్టంచేశారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకుంటే త్వరలోనే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సంగని సూర్యకిరణ్, అర్బన్, రూరల్ కో ఆర్డినేటర్లు గండ్రకోట రాకేశ్యాదవ్, పిల్లల నాగరాజ్, కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరస్వామి, అర్షం మధుకర్, నాయకులు పస్తం అనిల్, కల్యాణ్, చిర్రా ప్రకాశ్, రాకేశ్ పాల్గొన్నారు.