జయశంకర్ భూపాలపల్లి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్ తండ్రి కొమురయ్య విగ్రహాన్ని ఉదయం 11:30 గంటలకు కేటీఆర్ ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12గంటలకు మొగుళ్లపల్లిలోని శ్రీలక్ష్మీసాయి గార్డెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. యాదవులు, గౌడ్స్‌తో పాటు పలు కుల సంఘాలతో సమావేశమై రేవంత్ ప్రభుత్వం కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్న అంశంపై చర్చిస్తూ భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడతారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
అక్కడ భోజనం చేసిన తరువాత చిట్యాల, జడలపేట, కొత్తపల్లి(ఎస్ఎం), మోరంచపల్లి మీదుగా భూపాలపల్లికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటారు. రెండు గంటలకు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అవసరమైన ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.