వర్ధన్నపేట, డిసెంబర్ 18: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లందలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన గౌడ కమ్యూనిటీ భవనాన్ని కుల సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ సంఘానికి కమ్యునిటీ భవనాన్ని మంజూరు చేయడంతో భవనానికి స్లాబ్ వేయించామని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల సమక్షంలోనే భవనాన్ని నిర్మించి బిల్లులు రికార్డు చేసినా మంజూరు చేయడం లేదని వారు వివరించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కుల సంఘాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తం లో నిధులు కేటాయించి కమ్యూనిటీ భవనాలను మంజూ రు చేశామన్నారు. భవన నిర్మాణాలు మధ్యలో ఉన్నందున ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా కుల సంఘాల ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అలాగే, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం విపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ప్రభుత్వ నేతలను విమర్శించా రు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా పక్కా గృహాలను మంజూరు చేయకపోగా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు.
ప్రధానంగా రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతులు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. అలాగే, ఇల్లంద అయ్యప్ప ఆలయాన్ని ఆయన సందర్శించి అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ సర్పంచ్ కుమారస్వామి, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.