హనుమకొండ చౌరస్తా, మే 11: దేశానికి రక్షణ కవచంలా ఉన్న సైన్యానికి మనోధైర్యం కల్పించి మనమం తా అండగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ ఆపరేషన్ సిందూర్‌తో దాడులు నిర్వహించి దీటైన సమాధానం చెప్పిందన్నారు.
అమరులైన యుద్ధవీరులకు నివాళులర్పించేందుకు కాగడాల ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఓరుగల్లు ప్రజలు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి దేశానికి స్ఫూర్తిగా నిలువాలన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రాకేశ్‌రెడ్డి భారత రక్షణ శాఖకు రూ.25వేల చెకు అందించారు. ఆపరేషన్ సిందూర్‌తో వంద శాతం విజయం సాధించామని 1970లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ ప్రభాకర్ తెలిపారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని మళ్లీ యుద్ధం వస్తే పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ చెప్పారు. ఆర్మీ జవాన్లకు అందరం అండగా ఉండాలని పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అన్నారు.