ఊరూవాడ ఒక్కటై ఎల్కతుర్తికి తొవ్వపట్టింది. బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ కోసం జట్టు కట్టి పోరుగల్లుకు పోటెత్తింది. ఉద్యమ సమయంలో కదంతొక్కిన విధంగా గులాబీ జెండాలు పట్టి.. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ యావత్ తెలంగాణం జనప్రవాహమై కదిలివచ్చింది. పార్టీ రజతోత్సవం సందర్భంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసిన గులాబీ సైన్యం, కేసీఆర్ అభిమాన గణం చీమలదండులా బైక్లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ర్యాలీగా మహాసభకు బయల్దేరడంతో కనుచూపు మేర దారులన్నీ కోలాహలంగా మారాయి.
ఎటుచూసినా వాహనాల వరుసలే కనిపించగా చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కాగా.. దారి వెంట ‘జై కేసీఆర్’.. ‘జై తెలంగాణ’ నినాదాల హోరుతో మార్మోగాయి. మధ్యాహ్నం నుంచే సభా ప్రాంగణానికి జనం రాక మొదలుకాగా, సాయంత్రం కల్లా నేల ఈనిందా అన్నట్లు లక్షలాది మంది ప్రభంజనంలా రావడంతో సభ సూపర్ సక్సెస్ అయింది. అభిమాన నేత కేసీఆర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జనం.. సుమారు గంట పాటు సాగిన ప్రసంగాన్ని అంతే శ్రద్ధగా విని ఈలలు, చప్పుట్లు, కేరింతలు కొట్టారు.
– ఎల్కతుర్తి, ఏప్రిల్ 27
భీమదేవరపల్లి, ఏప్రిల్ 27 : ఎల్కతుర్తి రజతోత్సవ సభ కళాకారుల ఆటపాటలతో ఉర్రూతలూగింది. తెలంగాణ సాంస్కృతిక మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు సభను హోరెత్తించారు. ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క.. గులాబీ ల జెండలే రామక’. పాటకు కళాకారులతో పాటు సభకు వచ్చిన జనం డ్యాన్స్ వేశారు. ‘కోట్ల గొంతులను ఏకం చేసింది తెలంగాణ జెండా.. కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా’ అనే పాటకు ప్రజల్లో ఆనందం పెల్లుబికింది.
ఆద్యంతం జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ‘ఆగమైపోతున్నది తెలంగాణ.. అంధకారంలో ఉన్నది తెలంగాణ’ అనే పాటను రసమయి పక్కనే ఉండి చిన్నారి గూడూరి కతిషారెడ్డితో పాడించగా ప్రజలు జేజేలు కొట్టారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా’.. పాటకు ఎమ్మెల్యే మల్లారెడ్డి వేదికపై స్టెప్పులేసి జోష్ నింపారు.