మహోజ్వల ఘట్టానికి వేళయింది. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహించే రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి వేదికగా ఆదివారం కనీవినీ ఎరుగని రీతిలో జరుగబోయే పాతికేళ్ల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తికాగా ఊరూవాడా ఏకమై లక్షలాదిగా కదిలివస్తున్నది. ఇప్పటికే ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఆటోలతో ర్యాలీలు.. పాదయాత్ర చేసుకుంటూ మహాసభకు చేరుకుంటుండడంతో దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొన్నది. అలాగే సభా ప్రాంగణం సహా వరంగల్ నగరమంతా బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో ముస్తాబై గులాబీ వర్ణం సంతరించుకుంది. ఇక అందరి దృష్టీ నేటి మహాసభపై ఉండగా కేసీఆర్ ప్రసంగం వినాలనే ఉత్సాహం సర్వత్రా కనిపిస్తోంది.
– ఎల్కతుర్తి, ఏప్రిల్ 26
అన్ని వర్గాలు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిం ది. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగనున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేదికగా చేసే ప్రసంగం కోసం అన్ని వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాయి. ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, తెలంగాణవాదులు, కేసీఆర్ అభిమానులు ఎల్కతుర్తి మహాసభకు వస్తున్నారు. ఎడ్లబండ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలు, వ్యాన్లు, బస్సుల్లో స్వచ్ఛందంగా మహాసభకు బయలుదేరుతున్నారు.
వేలాది వాహనాలతో లక్షలాది మంది బీఆర్ఎస్ రజతోత్స వ మహాసభకు వస్తున్నారు. ఎల్కతుర్తికి చేరుకునే అ న్ని రోడ్లలోనూ శనివారం రాత్రి నుంచే సందడి మొదలైంది. ఎల్కతుర్తి నుంచి అన్ని దారుల్లోనూ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు అందంగా ముస్తాబయ్యాయి. లక్షలాది మంది హాజరయ్యే మహాసభను పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఏర్పాటైంది. కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించింది. పదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది.
ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రస్తుతం కీలక సందర్భవం వచ్చింది. 14 ఏండ్ల ఉద్యమం, పదేండ్ల సుపరిపాలన, 16 నెలలుగా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర.. అన్నింటి మేళవింపుగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఎల్కతుర్తిలో ఘనంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రస్థానంలో కీలకమైన ఈ మహాసభకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. భారీ బహిరంగసభల నిర్వహణలో బీఆర్ఎస్ గతంలో ఉన్న రికార్డులను కొనసాగించేలా ఎల్కతుర్తి మహాసభ జరుగనున్నది.
ఎండల తీవ్రత నేపథ్యంలో మహాసభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 10 లక్షల వాటర్ బాటిళ్లను, 10 లక్షల సల్ల ప్యాకెట్లను సభా ప్రాంగణంలో ఎక్కువ చోట్లలో పంపిణీ చేయనున్నారు. అత్యవసరాల కోసం మరో 6 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధంగా పెట్టారు. మహాసభ ప్రాంగణం చుట్టుపక్కల 12 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆరు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణం పరిధిలో 1200 తాత్కాలిక టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు. మహాసభకు వచ్చే వారికి సాయం చేసేందుకు, పార్కింగ్ నిర్వహణ కోసం 2 వేల మంది వలంటీర్లు ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో శనివారం రాత్రి నుంచే విధులకు సిద్ధమయ్యారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లలో వేల చోట్ల మహాసభ మార్గాన్ని సూచించేలా బోర్డులను పెట్టారు. వాహనాల్లో వచ్చే ఏ ఇబ్బంది లేకుండా బోర్డులను చూసుకుంటూ మహాసభకు సులభంగా చేరుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఎల్కతుర్తిలోని 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 154 ఎకరాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక సిద్ధమయ్యాయి.
1059 ఎకరాల్లో పార్కింగ్ మహాసభకు వచ్చే వాహనాల పార్కింగ్ నుంచి కిలో మీటరు దూరంలోపే మహాసభ ప్రాంగణం ఉన్నది. వాహనాల్లో వచ్చిన వారు సల్వ దూరంలోనే మహాసభకు చేరుకునేలా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. సభాప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో 200 జనరేటర్లతో లైటింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. మహాసభ ప్రాంగణం నుంచి కిలో మీటర్ల దూరం వరకు కేసీఆర్ ప్రసంగం స్పష్టంగా కనిపించేలా, వినిపించేలా 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లను, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో 25 రోజులగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జరిగాయి.
1100మంది పోలీసులతో బందోబస్తు
సుబేదారి, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు 1100మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8మంది ఏసీపీలు, 28మంది ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు 66మంది ఎస్సైలు 137మంది హెడ్ కానిస్టేబుళ్లు, 511మంది 200 హోంగార్డ్సు, మిగతా వారు డిస్ట్రిక్ట్ గాడ్స్, పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గులాబీ జెండాయే తెలంగాణకు శ్రీరామరక్ష
ఎల్కతుర్తి, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సభకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆమె అభివర్ణించారు. సభావేదికకు వచ్చిన ఎడ్లబండ్లను కవిత నడిపి వారిని ఉత్సాహపర్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు పాల్గొన్నారు.