‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. ఆపత్కాలంలో అండగా ఉండాల్సింది పోయి.. ఆరోపణలు, విమర్శలు చేస్తారా? వరద బాధితులకు కేంద్రం తరఫున నష్టపరిహారం ప్రకటిస్తారని అనుకున్నాం.. కానీ కిషన్‌రెడ్డి విమర్శలతోనే సరిపుచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు.’ అని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్లే భారీ వర్షాలు కురిసినా నష్టాన్ని నివారించగలిగామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలను కించపరిస్తే జాతీయ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.
హనుమకొండ, జూలై 30 : విపత్కర పరిస్థితుల్లో ప్రతి పక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆకాల వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైనా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎటువంటి నష్టం జరుగకుండా సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వరదల్లో చికుకుపోయిన వారికి ఆహారం, మంచి నీళ్లు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేశామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్ధేశం చేశారన్నారు.
గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన సమ్మయ్య నగర్, వాజపాయ్ కాలనీ, కుడా కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల ఈ సారి చాలా వరకు వరద ముప్పు తప్పిందని చీఫ్ విప్ తెలిపారు. నగరంలోని వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ తక్షణ సహాయం కింద రూ. 25 కోట్లు, ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో శాశ్వతంగా డ్రెయిన్ నిర్మాణ పనులకు రూ.100 కోట్లు కేటాయించగా, ఆ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. భారీ వర్షాలు, వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనో ధైర్యం కల్పించి అండగా నిలవాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని అన్నారు. ఆపతాలంలో ప్రజలకు అండగా ఉండండి.. కానీ రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయొద్దని ఆయన హితవు పలికారు. వర్షాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.
వరంగల్ నగరానికి వచ్చిన కేంద్రమంత్రి వరద బాధితులకు అండగా ఉంటారని, నష్ట పరిహార ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశించామని, అలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ‘కిషన్‌రెడ్డి వర్షాలు, వరదలు తగ్గిన నాలుగు రోజుల తర్వాత వచ్చారు.. వర్షాలు పడ్డప్పుడు వస్తే బాగుండేది.’ అని అన్నారు. కేంద్ర మంత్రి వరంగల్‌కు వచ్చి వరదలపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన భద్రకాళి చెరువు కట్ట మట్టి కొట్టుకపోవడంతో దాన్ని కూడా రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. అయినప్పటికి జిల్లా యంత్రాంగం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి ఏలాంటి నష్టం జరుగకుండా పూడ్చివేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ రోడ్స్ నిధులు సకాలంలో విడుదల చేస్తే పనులు పూర్తయి వరదల ప్రభావం ఇంతగా ఉండేది కాదన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీ నిధుల కింద రూ. 196 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 213 కోట్లు కేటాయించిందని తెలిపారు. వరద బాధితుల కోసం ఏం చేస్తారో కిషన్‌రెడ్డి స్పష్టత ఇస్తే బాగుండేదని చీఫ్ విప్ అన్నారు.
అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు..
కేంద్ర మంత్రి ఆదివారం భూపాలపల్లి, వరంగల్ నగరంలో పర్యటించి అనవసర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కేంద్రం ఇది చేసిం ది, రాష్ట్రం ఏమీ చేయడం లేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసేందుకు ఇది సమయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతోనేనని చెప్పారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతున్నారని, పంట నష్టం కింద సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10వేలు ఇస్తానంటే రూ. 3500 మాత్రమే ఇవ్వాలని చెప్పింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందన్నారు. నిన్న రేవంత్‌రెడ్డి, ఈ రోజు కిషన్‌రెడ్డి ఏమి మాట్లాడారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కరువు వస్తుందనే ఆలోచనలో ఉన్న సమయంలో భారీ వర్షాలు కురువడంతో నష్టం వాటిల్లిందన్నారు. పార్లమెంట్ సభ్యులు చట్టాలను అమలు చేయాలి కాని అపహాస్యం చేయరాదని హితవు పలికారు. భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు సంబంధించి నాలాలకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నాలాలపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని, వరంగల్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.