నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 6 : బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిల అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్తుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏమిటిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రశ్నించే నాయకులను నిర్బంధించడం, నిరసన తెలుపకుండా అడ్డుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌కు తగదని మండిపడ్డారు. ప్రజాహక్కులను కాలరాస్తున్న సర్కారుకు త్వరలో ప్రజలే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు వచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులతో ప్రజలను మభ్యపెడుతున్నదని విమర్శించారు. పాలనను గాలికొదిలేసి బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, వాటికి బెదరమని స్పష్టం చేశారు.