సర్కారు ఉక్కుపాదంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అడుగడుగునా పోలీసులు ఉక్కుపాదం మోపి అడ్డంకులు సృష్టించినా ఉద్యమస్ఫూర్తితో తమదైన వ్యూహంతో కదంతొక్కింది. బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చిన నాటినుంచి పోలీస్ యాక్ట్ పేరుతో అణచివేయాలని చూసినా జిల్లా నలమూలల నుంచి చీమలదండులా ములుగుకు కదలివచ్చింది. పోలీసుల ఏకపక్ష ధోరణితో వ్యవహరించినప్పటికీ ఎక్కడికక్కడ ఖాకీల వలయాన్ని ఛేదించుకొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్.. సీతక్క డౌన్‌డౌన్.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ.. ములుగు జిల్లాలో సీతక్క ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యమా.. పోలీస్ రాజ్యాంగమా..? చుక్క రమేశ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’ నినాదాలతో హోరెత్తించింది. ఇదిలా ఉంటే నిరసనలకు అనుమతి లేదని చెప్పినప్పటికీ పోలీసుల రక్షణలో కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకోగా, పోలీసుల ఏకపక్ష ధోరణిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
ములుగులో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం సక్సెస్ అయింది. పోలీసులు ఆదివారం రాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణుల ఇండ్లకు చేరుకొని అక్రమ అరెస్టుల పర్వం కొనసాగించారు. మంత్రుల పర్యటన కోసం పోలీస్ యాక్టు పేరుతో ముందస్తు అరెస్టులు చేసినా ఒక్కొక్కరై జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మార్కెట్ రోడ్డు నుంచి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి ప్లకార్డులను చేతబూని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి సైతం కుమ్మరిపల్లి నుంచి పోలీసుల కల్లు కప్పి గాంధీ విగ్రహం వద్దకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ సకినాల భవాని సైతం నినాదాలతో హోరెత్తించారు. గాంధీ చౌక్ వద్ద నిరసన తర్వాత ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకునే క్రమంలో పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి ఉండగా కొందరు రైతులు బీఆర్ఎస్ నేతలను పిలవడంతో అక్కడి చేరుకొని వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులు తమకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందించడం లేదని తెలిపారు.
అక్కడినుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న నాయకులను పోలీసులు గేటు వద్ద ఆపివేశారు. అదనపు కలెక్టర్ మహేందర్‌జీ తన వాహనం ద్వారా గేటు వద్దకు రాగా జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యలు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో జరిగిన అవకతకలు, ప్రభుత్వం ప్రజలపై విధించిన పోలీస్ యాక్టును పెద్ది వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి సీతక్క గట్టమ్మ నుంచి వస్తున్న విషయం తెలుసుకున్న నేతలు కాన్వాయిని అడ్డుకునేందుకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు, డీసీఎంలను అడ్డుపెట్టి రోప్ పార్టీతో నెట్టివేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కింద పడిపోగా బీఆర్ఎస్ నాయకులు పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. బడే నాగజ్యోతి, ఏరువ సతీశ్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు జాతీయ రహదారిపైకి చేరుకొని మంత్రి కాన్వాయిని అడ్డుకునేందుకు బైఠాయించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ఎస్ నాయకులను అడుగడుగనా అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు. భారీ బైక్ ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్పీ, పోలీస్ అధికారులు సమక్షంలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు చేసి జై సీతక్క నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులు రక్షణ కవచంలా మారడం, జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను అణచివేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సకినాల భవాని, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, పాలెపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు పోరిక విజయ్‌రామ్‌నాయక్, నునావత్ మహేశ్ నాయక్, వేములపల్లి భిక్షపతి, భూక్య జంపన్న, ముడుతనపల్లి మోహన్, బైకాని ఓదేలు, గజ్జి నగేశ్, కవ్వంపల్లి బాబు, వలీబాబా, అనుముల సురేశ్, ఆదిరెడ్డి, ఆరెందుల కుమార్, మొర్రి రాజ్‌కుమార్, చీదర సంతోశ్, ద్రోణాచారి, మాసిపెద్ది సత్యం, మాలోత్ రవీందర్, నాజర్‌ఖాన్, కాసీం, రాణాప్రతాప్, రొంటాల భిక్షపతితో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో జరిగే అరాచకాలు, అవినీతి, అక్రమాలు అక్ర మ ఇసుక దందాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మంత్రి సీతక్క పోలీసు అధికారుల తుపాకులను అడ్డుపెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నది. సామాన్యులపై మంత్రి సీతక్క తన జులుం ప్రదర్శిస్తున్నది. ప్రజలతో పాటు అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో వారు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ చెప్తే అక్కడ అధికారులు సంతకాలు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేతల తీరుతో ఆత్మహత్యలు, భౌతిక దాడులు, అక్రమ కేసులపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామంటే పోలీస్ యాక్టు పేరుతో అణచివేస్తున్నారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క మొత్తం ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించిన ఆమె నేడు మంత్రి పదవి రాగానే తన మాటలను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.
ప్రశ్నించే గొంతులను తుంచేస్తారా..? కోసేస్తారా..?. కాంగ్రెస్ నాయకులు అరాచకాలు చేస్తూ జనాలను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? జిల్లా ఎస్పీ ప్రకటించిన పోలీస్ యాక్టు అమలులో ఉన్నప్పుడు మంత్రుల పర్యటనలు, కాంగ్రెస్ నాయకుల సభలు, సమావేశాలు ఎలా జరుగుతాయి. వాటికి సంబంధించిన రాతపూర్వకంగా అనుమతులు ఉంటే పోలీసు అధికారులు బహిరంగ పర్చాలి. జిల్లాలో పోలీసు అధికారుల అక్రమాలు పెరిగాయి. అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ అక్రమ వ్యాపారాల్లో వాటాదారులుగా కోట్లాది రూపాయలు పోలీసు అధికారులు వెనుకేసుకుంటున్నారు. ములుగు పోలీసుల తీరుపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో పాటు వారిపై డీజీపీకి సైతం ఫిర్యాదు చేస్తాం.
ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టించింది. నియో జకవర్గంలో కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం పెరిగిపోయింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిది దొంగ సర్టిఫి కెట్లను అమ్ముకొని గతంలో జైలుకు వెళ్లిన చరిత్ర. నయీం ముఠా సభ్యుడైన అశోక్ జిల్లాలో రౌడీ రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. జైలుకు వెళ్లిన చరిత్ర ఉన్న ఆయన పార్టీ మండల అధ్యక్షులుగా గూండాలు, రౌడీలను నియమించుకొని రౌడీ రాజకీయం చేస్తున్నాడు. సీతక్క అండదండలతో అక్రమాలకు తెగబడుతున్నాడు. అవినీతి ఆరోపణలు, అక్రమ దందాలు చేస్తున్న వారిని పార్టీ నాయకులుగా నియమించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. మంత్రి సీతక్క సైతం రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తూ బెదిరింపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. పోలీసులు కూడా తమ ప్రవర్తన మార్చుకొని న్యాయం వైపు నిలువాలి.
ఆత్మకూరు : శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మమ్మల్ని అడ్డుకోవడమేంటి. నక్సలైట్‌గా పనిచేసి జనారణ్యంలో కలిసిన మంత్రి సీతక్క.. రాజ్యాధికారం ఉందనే పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నది. పేద రైతుల పొట్ట కొడుతున్నది. మీ పాలనలో గిరిజనులు, కోయలకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. రాబోయే రోజుల్లో మీ చరిత్రను కాలగర్భంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
రమేశ్ ఆత్మహత్య చేసుకునేలా మానసిక వేధింపు లకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కోవాలి. ఇందిరమ్మ కమిటీల పేరుతో పేదలకు ఇవ్వా ల్సిన ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా రమేశ్ ప్రశ్నించగా పోలీస్ అధి కారులు, కాంగ్రెస్ నాయకులు వేధింపులకు గురిచేసి ప్రాణం పోయేలా చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవ హరించొద్దు. అన్ని పార్టీలను ఒకేలా చూడాలి.
ఆత్మకూరు : ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అడిగిన వారిపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజావ్యతిరేకతను ఎదురోక తప్పదు. ఇందిరమ్మ ఇల్లు అడిగిన రమేశ్ ఆత్మహత్య చేసుకునేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ముమ్మాటికీ అతడిది ప్రభుత్వ హత్యే. ములుగు జిల్లాలో అపక్రటిత ఎమర్జెన్సీని, పోలీస్ యాక్ట్‌ను వెంటనే ఎత్తివేయాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఆత్మకూరు : ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నది. చివరకు ఆత్మహత్యలు చేసుకునేదాక తీసుకొచ్చింది. మంత్రి సీతక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకంగా పోలీస్ యాక్ట్ పెట్టి అణిచివేతకు పాల్పడుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించిన చుక్కా రమేశ్‌పై కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టారు. వేధింపులకు గురిచేశారు. చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుత నిరసనకు పూనుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. తనకు జై కొట్టిన గొంతుకలను మంత్రి సీతక్క నలిపేస్తున్నది. కష్ట కాలంలో అండగా నిలిచిన ములుగు ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను 7వ గ్యారంటీగా ముందుకు తెచ్చి అక్రమాలకు పాల్పడుతున్నది. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పోలీస్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది. అర్హులకు పథకాలు ఇవ్వండి.. అనర్హులకు కాదని శాంతియుత నిరసనకు అనుమతి అడిగితే పోలీసులు అభ్యంతరాల పేరుతో అణచివేస్తున్నారు. రమేశ్ ఆత్మహత్య ముమ్మాటికీ పోలీసుల కారణంగానే జరిగిన హత్య. ప్రజాపాలన అంటే పోలీస్ యాక్టు అమలు చేయడమేనా? తప్పులు ఎత్తి చూపితే భౌతికదాడులు, లేదంటే పోలీస్ కేసులు నమోదు చేయడం ములుగులో పరిపాటిగా మారిం ది. మంత్రి సీతక్క ఆ రోజు పేదల కోసం కొట్లాడుతా అని పోలీసుల మీద, ప్రభుత్వం మీద తిరగబడి నేడు ప్రభుత్వంలో భాగమై మంత్రి పదవి రాగానే పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతులతో పాటు పేద ప్రజలను అణగదొక్కుతున్నది. సీతక్క.. ఇదేనా న్యాయం.. ఇదేనా ప్రజాపాలన. అక్రమాలు బయటపడుతాయనే పోలీస్ యాక్టును అడ్డు పెట్టుకొని ప్రజా నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమంలో సైతం ఇంతటి ఆరాచక పాలన చూడలేదు. కింది నుంచి పైస్థాయి వరకు పోలీసు అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల తీరుగానే పనిచేస్తున్నారు. అధికారులంతా ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఇంకా రెండేళ్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో వారందరికీ భవిష్యత్తులో కచ్చితంగా తగిన సమాధానం చెబుతాం. ఏ ఒక్కరినీ వదిలేదు లేదు