కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 3 : ‘కౌన్సిలర్‌గా టికెట్ రాని ఆశావహులు అధైర్యపడొద్దు.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తాం’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఆశించిన ప్రతి ఒకరికీ పార్టీ టికెట్ రావడం సాధ్యపడదని, సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. పార్టీ నుంచి టికెట్ రానివారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. టికెట్ రాలేదని అలక బూనొద్దని, పెద్ద మనసుతో అంగీకరించి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సైనికులంతా కలిసికట్టుగా అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తే, భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కాంగ్రెసోళ్లకు ఓటమి భయం పట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. గండ్ర జ్యోతి మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో మూడోసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తకువ కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు తదితరులు పాల్గొన్నారు.
అన్ని కులాలకు సముచిత స్థానం : బండా ప్రకాశ్
బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కోసం అనేక మంది పోటీపడ్డారు. పార్టీ శ్రేణులతో చర్చించాకే అభ్యర్థులను ప్రకటించాం. టికెట్ రానివారు ఎవరూ నిరుత్సాహపడొద్దు. పార్టీ నిర్మాణంలో తప్పకుండా అవకాశం కల్పిస్తాం. అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించాం. కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, బీసీల ఆత్మగౌరవాన్ని తుంగలో తొకి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే కచ్చితంగా జిల్లా పోతుందన్న విషయాన్ని వార్డుల్లో ప్రతి ఇంటికి తెలియజేయాలి. అబద్ధపు హామీలతో గద్దెనెకి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి.