న్యూశాయంపేట, మే 8 : నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగ సంక్షేమ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ 31వ డివిజన్లోని దీన్‌దయాళ్ నగర్, జ్యోతి రావు ఫూలే కాలనీల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు గూడు, నీడ కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జీవో నంబర్ 58 జారీ చేశారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకే గుడిసెవాసుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ చేసి గుడిసెవాసుల నలభై ఏండ్ల నిరీక్షణకు తెరదించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆలకుంట్ల వెంకన్న, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సీపీఎం నాయకులు కంచర్ల కుమార స్వామి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ రాజ్‌కుమార్, నాయకుడు జానకీ రాములు పాల్గొన్నారు.
అన్నదానం చేయడం తృప్తినిచ్చింది
కాజీపేట : హనుమాన్ దీక్ష మాలధారణ స్వాములతో కలిసి పూజలో పాల్గొని, అన్నదానం చేయడం తృప్తినిచ్చిందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ దర్గా కాజీపేటలోని శివాలయంలో శ్రీ అభయాంజనేయస్వామి ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారణ స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వినయ్‌భాస్కర్ పాల్గొని, స్వాములలో కలిసి ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠిన దీక్షలతో ఆయురారోగ్యాలతో పాటు, క్రమశిక్షణ, దైవభక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు వలుపదాసు రాజా సుకమార్, తట్ల రమేశ్, సమ్మయ్య, ఈగ మల్లేశం, గణేశ్, టీజేఎస్ఎఫ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, ప్రేమ్, రాజేశ్, సన్నీ, గిరిధర్ పాల్గొన్నారు.