సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన క్రమంలో హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ముఖ్య కార్యకర్తలతో పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించిన స్థలంలో నిరసన తెలిపేందుకు ముఖ్య నేతలు, కార్యకర్తలతో వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.
కనీసం నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద నిరసనకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా వినకుండా కార్యాలయంతో పాటు అడుగడుగునా నిర్బంధించారు. ఈ క్రమంలో నిర్బంధాలను దాటుకుంటూ వినయ్‌భాస్కర్ పోలీసులను ప్రతిఘటిస్తుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు మధ్య తోపులాటతో పాటు వాగ్వాదం జరిగింది. వినయ్‌భాస్కర్‌తో పాటు పలువురు నాయకులను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రుల పర్యటన ముగించుకొని వెళ్లేదాకా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు.