జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు. తమ పార్టీ బలపర్చిన నేతలు గెలిచే పరిస్థితి లేదని గుర్తించి, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏకగ్రీవానికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండో విడత జరిగిన ఏకగ్రీవాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను తమ అభ్యర్థులు తట్టుకునే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థులను డ్రాప్ చేయించి బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్‌లో చేర్పించుకుని సర్పంచ్ పదవి అప్పగిస్తూ ఏకగ్రీవం చేసుకుంటున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఒక్క ఆర్టీసీ బస్ (మహాలక్ష్మి) హామీ మినహా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ ప్రజలను నమ్మించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు మరిచి మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి లొంగదీసుకోవడం కాదు.. బ్యాలెట్ పద్ధతిలో గెలవాలని గుర్తు చేస్తున్నారు. హస్తం బరితెగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల సొంత గ్రామాల్లో పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ప్రలోభాలకు గురిచేస్తూ విత్‌డ్రా చేయించి తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకుంటున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది.
భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉండగా ప్రధానంగా సర్పంచ్ స్థానాలపై కన్నేసిన అధికారపార్టీ నేతలు ఏకగ్రీవంపై దృష్టి సారించారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో 19 సర్పంచ్ స్థానాలు, 147 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా ఇందులో అధిక శాతం బీఆర్ఎస్లో కొనసాగిన అభ్యర్థులు పార్టీ మారి ఏకగ్రీవమయ్యారు. మండల అధ్యక్షులు సైతం పార్టీ మారి సర్పంచ్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. ఈ తతంగంలో అధికార పార్టీ నేతల ఒత్తిడి ఏ మేరకు ఉందో అవగతమవుతుంది. పార్టీలో అభ్యర్థులు కరువై, ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను నయానో బయానా లొంగదీసుకుంటున్నారనే చర్చ కొనసాగుతుంది.