చిల్పూరు/దుగ్గొండి, మే 9 : మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతులతో కలిసి శనివారం ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్నా చేపట్టారు. అంతకుముందు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు ఒక్క లారీ లోడ్ ధాన్యాన్ని కూడా తరలించలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రాజయ్య రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు.
రైతులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చోద్యం చూస్తున్నదన్నారు. వారం రోజుల లోపు రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. అలాగే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్లో మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులకు సరిపడా గన్నీ సంచులు అందించి, కాంటాలు పెట్టి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తరలించాలని, చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.