దుగ్గొండి : కిరాణా షాపుకు వెళ్లిన బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చెన్నారావుపేట మండలం పుల్లయ్యగూడ తండా వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లయ్యగూడ తండాకు చెందిన భూక్య జ్యోతి, వెంకన్న దంపతుల కుమారుడు అనిల్(10) గూడూరు మండలం అయోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
మంగళవారం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన బాలుడు రోడ్డు పక్కనే ఉన్న కిరాణా షాపుకు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా గూడూరు నుంచి నెక్కొండవైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.