ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల ప్రణాళికా లోపం వరంగల్ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నగరాభివృద్ధికి అడ్డంకిగా పరిణమిస్తున్నాయి. హడావుడి ప్రకటనలు చేయడం.. అంతే వేగంగా పనులు చేయకపోవడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పూడికతీత, సుందరీకరణ పేరిట భద్రకాళీ చెరువును ఖాళీ చేసిన అధికారులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. చెరువు మట్టి తవ్వకం ద్వారా కోట్లాది రూపాయలు సమకూర్చుకోవచ్చన్న అంచనా తప్పడంతో అయోమయంలో పడ్డారు. రెండుసార్లు పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ స్పందించకపోవడంతో ఓపెన్ యాక్షన్ వైపు అడుగులు వేశారు. ఇంత చేసినా పూడిక తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? వానకాలం లోపు అన్ని పనులు పూర్తవుతాయా? అనే సందిగ్ధత సర్వత్రా నెలకొన్నది.
– వరంగల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చేపడుతున్న పనులు ప్రతికూలంగా మారుతున్నాయి. హడావుడి ప్రకటనలకు తగినట్లుగా చర్యలు లేకపోవడంతో వరంగల్ నగర అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సుందరీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చారిత్రక భద్రకాళీ చెరువును ఖాళీ చేశారు. వానకాలం మొదలయ్యేలోపు పూడిక తీసి, సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. నీటిని బయటకు వదిలినంత వేగంగా తదుపరి పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ నిర్ణయం, అధికారుల ప్రణాళిక లోపాలతో భద్రకాళీ చెరువు అభివృద్ధి ఇప్పుడు గందరగోళంగా మారింది.
చెరువు పూడికతీత పనులను చేపట్టిన సాగునీటి శాఖ.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 382 ఎకరాల విస్తీర్ణంలోని భద్రకాళీ చెరువులో 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల మట్ట్టి తవ్వకాలకు టెండర్లు పిలిచింది. క్యూబిక్ మీటర్ మట్టిని తవ్వుకునేందుకు రూ.162.56 చొప్పున రూ. 9.50 కోట్ల ఆదాయం సమకూర్చుకునే అంచనాతో ప్రణాళిక రూపొందించింది. అయితే అధికారుల ప్రణాళికకు వాస్తవ పరిస్థితులకు తేడా కొట్టింది. ఈ పనుల కోసం రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. చెరువు సమీపంలో వ్యవసాయ భూములు లేకపోవడంతో పూడిక మట్టిని తీసి ఏం చేయాలనేది అధికారులకు అంతుపట్టడంలేదు. దీంతో రెండు నెలలు ఎదురు చూసిన సాగునీటి శాఖ ఇప్పుడు ఓపెన్ యాక్షన్ వైపు మొగ్గు చూపింది. చెరువులోని క్యూబిక్ మీటర్ మట్టి తవ్వుకునేందుకు రూ.71.82 చెల్లించేలా తాజాగా నిర్ణయించింది. ఇప్పుడు మట్టి తవ్వుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనేది స్పష్టత రావడంలేదు.
ఆందోళనలో మత్స్యకారులు
భద్రకాళీ చెరువులోని నీరు ఖాళీ చేయడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కిందికి పోతున్నాయి. ఈసారి ముందుగానే ఎండలు ఎక్కువయ్యాయి. ఏప్రిల్, మేలో తాగునీటి సమస్య అధికమయ్యే ప్రమాదం ఉందని పరిసర ప్రాం తాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భద్రకాళీ చెరువు నీటి పై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు గత వానకాలంలో చేపల ఆదాయం కోల్పోయారు. జూన్ నాటికి అనుకున్నట్లుగా చెరువులో నీరు నింపి చేప పిల్లలను వేస్తామని సాగునీటి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఇంకా పూడిక తీత పనులే మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన పెరుగుతున్నది.
వంద రోజులు
భద్రకాళీ చెరువు సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అధికారులు గత ఏడాది నవంబర్ 8న భద్రకాళీ చెరువులోని నీటిని కిందికి వదిలారు. 20 రోజుల్లో 150 క్యూసెక్ల జలాలు దిగువన ఉన్న నాగారం చెరువులోకి వెళ్లాయి. వచ్చే మే నెలలోపు ఐదు ఫీట్ల లోతు పూడిక తీసే పనులు పూర్తి చేసి జూన్లో కురిసే వానలతో చెరువును నింపాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వానకాలం మొదలు కాకముందే భద్రకాళీ చెరువు పూడిక తీసి సుందరీకరణ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో వానకాలంలోపు చెరువు అభివృద్ధి పనుల పూర్తిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు వదిలి వంద రోజులు అవుతున్నదని, మరో వంద రోజుల్లో పనులు పూర్తి కాకుంటే ఇబ్బందులు తప్పవని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు.