జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్న రైతును రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిట్టనిలువునా దోచుకుంటున్నారు. సెంటర్లలో ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులకు ఇస్తున్న దుడువాయి తూనికపట్టి (స్లిప్)కు బస్తాల దిగుమతి సమయంలో రైస్ మిల్లుల్లో నమోదు చేసే ట్రక్షీట్కు భారీ తేడా ఉంటుంది. బస్తాలకు బస్తాలే మాయమవుతున్నాయి. సెంటర్లలో ధాన్యం తూకం నుంచి మిల్లుల్లో బస్తాలు దిగుమతి చేసే వరకు తరుగు, తాలు, మట్టి, తడిసిన ధాన్యం నెపంతో రైతుల కష్టాన్ని అందరూ కలిసి వాటాలుగా పంచుకుంటున్నారు.
ఇదంతా రైతులకు ఏ మాత్రం తెలియకుండా సెంటర్ల నిర్వాహకులు కోతలు పెడుతూ సైలెంట్‌గా ‘స్వాహా’ పర్వానికి తెరలేపారు. సెంటర్లకు ధాన్యం తెచ్చిన దగ్గర నుంచి తూకంవేసి కేటాయించిన మిల్లులకు తరలించి దిగుమతి చేసుకునే వరకు అంటే తక్‌పట్టీ నుంచి ట్రక్‌షీట్ నమోదు వరకు ప్రభుత్వం రైతులనే బాధ్యులను చేసింది. దీంతో ఒక్కో రైతు సెంటర్లలో కొనుగోళ్ల కోసం రాశులతోపాటే 20 నుంచి 30 రోజులకు పైగా పడిగాపులు కాసి చివరకు అధికారులు, నిర్వాహకుల కాళ్లావేళ్లా పడి గన్నీ సంచులు తెచ్చుకుంటున్నారు.
సెంటర్లలో తూకం వేసి రోజులు గడిచినా లారీల కొరతతో బస్తాలను మిల్లులకు తరలించడం గగనంగా మారుతున్నది. బస్తాకు 40 కిలోల 700 గ్రాములకు బదులు బస్తాకు 42 కిలోల తూకం వేయడం, లారీ యజమానులు బస్తాకు రూ.1 చొప్పున ఇవ్వాలని లేకుంటే ధాన్యం తీసుకెళ్లబోమని కొర్రీలు పెడుతున్నారు. ఇన్ని కష్ట, నష్టాలను భరించి ధాన్యం బస్తాలను మిల్లుల్లో దిగుమతి చేసుకున్న తర్వాత సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుకు తెలియకుండానే ట్రక్‌షీట్ నమోదులో బస్తాల సంఖ్యను తక్కువ చూపుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతుల కష్టాన్ని ఎలా దోచుకుంటున్నారో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జనగామ మండలం చీటకోడూరుకు చెందిన రైతుల తూకంలో వచ్చిన తేడాలే నిదర్శనం.

అదే గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన రైతులు సాదం రామనర్సమ్మ, సాదం మధు, సాదం మహేశ్, దండబోయిన స్వప్న పేరుతో ఐకేపీ నిర్వాహకులు ఈనెల 3న 40 కిలోల తూకంతో మొత్తం 528 బస్తాలను కొనుగోలు చేసినట్లు రైతులకు తక్పట్టి ఇచ్చారు. అదేరోజు జనగామ మార్కెట్ సమీపంలోని వీరభద్ర ఇండస్ట్రీస్‌లో ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకున్న తర్వాత ట్రక్‌షీట్ నంబర్ 3216తో మరోసారి నమోదు చేసిన బస్తాల తూకంలో నలుగురు రైతులకు సంబంధించిన 528 బస్తాలకు బదులు 525 బస్తాలుగా అంటే 40కిలోల చొప్పున మూడు బస్తాలు రైతులకు సమాచారం లేకుండా కోతపెట్టి అకౌంట్లలో డబ్బులు జమచేశారు. లెక్కప్రకారం తక్కువ డబ్బులు రావడంతో అనుమానంతో అందులోని ఓ రైతు మిల్లులో ఉండే ఐకేపీ నిర్వాహకురాలిని ఆరాతీస్తే మీ ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందట..
అందుకే తూకంలో 120 కిలోల ధాన్యం కోత పెట్టినట్లు సమాధానం చెప్పింది. తాను సెంటర్లోనే ధాన్యం ఆరబోసి 13 మాయిశ్చర్ (తేమ)లో యంత్రం ద్వారా తాలు, మట్టి లేకుండా నూర్పిడి చేసి ఇచ్చానని, అక్కడే తరుగు తీసి.. మళ్లీ ఇక్కడ తరుగు ఎందుకు తీసారని నిలదీసినా ఫలితంలేదు. రైతులకు సెంటర్లో దడువాయి తక్‌పట్టీ మాత్రమే ఇస్తున్న నిర్వాహకులు మిల్లులో చివరి నమోదు ట్రక్‌షీట్ ఇవ్వడంలేదు. కావాలని అడిగిన రైతులకు సైతం ఇవ్వకుండా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. నిర్వాహకులతో గొడవపడితే తమకు ఖాతాలో డబ్బులు వేయకుండా కొర్రీలు పెడుతారనే భయంతో రైతులు రెక్కల కష్టం పోతేపోనీలే అని సరిపెట్టుకుంటున్నారు. రైతులకు తెలియకుండానే ఈ దందాను సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు సాగిస్తున్నారు.
తక్‌పట్టీ తూకం మాత్రమే రైతులకు ఇస్తుండగా ట్రక్‌షీట్ ఇవ్వకుండా నిర్వాహకులు మాయ చేస్తున్నారు. తక్‌పట్టీ తూకానికి, బ్యాంక్ అకౌంట్లో జమైన మొత్తానికి తేడా ఉండటాన్ని అమాయక రైతులు గమనించడంలేదు. ఒకవేళ తేడా గుర్తించినా బ్యాంకులో ఏమైనా చార్జీలు మినహాయించారనే భావనతో ఉన్నారు. దీంతో సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు రైతులను తేలికగా దగా చేస్తున్నారు. అంతటా ఇదే దోపిడీ సాగుతున్నదని తెలుస్తున్నది. సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవాల్సిన మిలర్లు, నిర్వాహకులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని తాలు, మట్టి పెళ్లలు, ధాన్యం తడిసిందనే నెపంతో అన్లోడ్ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
దర్దెపల్లిలోనూ మోసం
పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దెపల్లి కొనుగోలు కేంద్రంలోనూ తూకానికి, ట్రక్‌షీట్‌లో ఎంట్రీలో భారీ తేడా చోటుచేసుకుంది. ఒకే రైతు ఏడు బస్తాల ధాన్యాన్ని తరుగు పేరుతో మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. దర్దెపల్లికి చెందిన పెండ్లి అనిల్ స్థానిక కొనుగోలు కేంద్రానికి 283 బస్తాల ధాన్యం తీసుకురాగా కాంటా పెట్టారు. అయితే ట్రక్ షీట్లో మాత్రం 276 బస్తాలే ఎంట్రీ చేశారు. దీనిని ఆలస్యంగా గుర్తించిన అనిల్ నిర్వాహకులపై మండిపడుతున్నాడు.
ఇప్పటికే రైతుల వద్ద నుంచి బస్తాకు రూ. 2 చొప్పున నిర్వాహకులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తూకం సమయంలో 41.600 కిలోలు కాంటా వేయాలని అధికారులు చెబుతుండగా, నిర్వాహకులు 42 నుంచి 42.600 కిలోల వరకు కాంటాలు వేస్తున్నారని, పైగా ట్రక్‌షీట్‌లో ఇంకా తక్కువ ఎంట్రీ చేస్తున్నారని వాపోయాడు. ప్రభుత్వం నిర్లక్ష్యం.. స్థానిక ఎమ్మెల్యే పట్టింపు లేని తనం.. అధికారుల అలసత్వంతో కాంటాలు కాక, లారీలు రాక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని పాలకుర్తి, దర్దేపల్లి, చెన్నూరు, విస్నూరు, ఈరవెన్ను, గూడూరు, వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి, వావిలాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు పేరుకుపోయాయని, తీరా కాంటాలై సొంతంగా ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తే అక్కడ హమాలీలు లేక నాలుగైదు రోజులైనా దిగుమతి కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే మిల్లుకు చేరిన తర్వాత బస్తాలకు బస్తాలే కోతలు పెడుతూ తమను దగా చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు.
అక్కడొకరు.. ఇక్కడొకరు
పరకాల, మే 16 : రైతులకు డబుల్ కష్టాలు మొదలయ్యాయి. మక్కలు అమ్ముకునేందుకు నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు ఇప్పుడు ధాన్యంతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో క్రయ విక్రయాలు సజావుగా జరగక రైతులు అవస్థలు పడుతున్నారు. కాంటాల కోసం నెల రోజులకు పైగా నిరీక్షించిన రైతులు, ఇప్పుడు బస్తాలు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నారు.
కాంటాలైన మక్కలు తరలించేంత వరకు రైతులదే బాధ్యత అని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో లారీల కోసం నిరీక్షణ తప్పడం లేదు. అయితే గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒకరు.. మండల కేంద్రంలో నెలకొల్పిన మక్కల సెంటర్లో మరొకరు కాపలాగా ఉండాల్సి వస్తున్నది. మండతున్న ఎండల్లో రైతులు తమ పంటల అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్ద నానా కష్టాలు పడుతున్నారు.
పరకాలలో నేను.. ఊర్లో నా భార్య..
మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి మక్కలు తెచ్చి నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు వాటిని తరలించలేదు. దీంతో ప్రతి రోజూ వచ్చి బస్తాలకు కాపలా కాయాల్సి వస్తున్నది. వరి పంట కోసి 15 రోజుల కిందత ధాన్యాన్ని గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించినం. అక్కడ ఇటీవలనే కేంద్రాన్ని ప్రారంభించారు. మా ఊర్లో వడ్ల కాడ నా భార్య, పరకాలలో మక్కల కాడ నేను కాపలాగా ఉంటున్నం. నా అనుభవంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.
– పుట్ట సాంబయ్య, రైతు, లక్ష్మీపురం, పరకాల మండలం