హనుమకొండ, ఆగస్టు 24 : హనుమకొండలో కాషాయ మూకలు రెచ్చిపోయాయి. ముట్టడి పేరుతో దౌర్జన్యానికి దిగి, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు, కట్టెలతో దాడి చేసి గూండాగిరీ చేయడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో కార్యకర్తలతో పాటు పోలీసులకూ గాయలవడంతో బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు గురువారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
కార్యాలయ దారుల్లో పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో పాటు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపకుండా క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. వ్యతిరేక నినాదాలతో కవ్వింపు చర్యలకు దిగి ఘర్షణ వాతావరణం సృష్టించారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా రాళ్లు, కట్టెలతో బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బందోబస్తులో ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని వారిని అడ్డుకొని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు వినలేదు. ఈ క్రమంలో బీజీపీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో హనుమకొండ ఎస్సై సతీశ్ సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.