జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త రాజలింగమూర్తి హత్య భూ వివాదం నేపథ్యంలో పథకం ప్రకారం జరిగినట్లుగా స్పష్టమవుతున్నది. జిల్లా కేంద్రంలోని సుమారు రూ. 3 కోట్ల విలువైన భూమిపై రాజలింగమూర్తి స్టే తెచ్చుకోగా గురువారం భూపాలపల్లి సబ్ కోర్టులో విచారణ ఉండగా ముందురోజే దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో కేసు విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. మృతుడి భార్య సైతం భూమి కోసమే తన భర్తను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
జిల్లా కేంద్రంలోని 319-బీ, 323 సర్వే నంబర్లలోని 2.25 ఎకరాల భూమికి సంబంధించి మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, రేణుకుంట్ల కుటంబ సభ్యుల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్నది. ఈ భూమిలో ఎకరం స్థలం రోడ్డు కింద పోవడంతో అది తమకు కాదంటే తమది కాదని, ఉన్న భూమిపై గొడవలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో నాగవెళ్లి రాజలింగమూర్తి అడ్వకేట్ గంట సంజీవరెడ్డితో కలిసి సెటిల్మెంట్ చేస్తానని, కోర్టులో తాము చూసుకుంటామని రేణుకుంట్ల చంద్రయ్య, రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల లక్ష్మి నుంచి సర్వే నంబర్ 319-బీలోని ఆరు గుంటల భూమిని రిజిస్ర్టేషన్ చేయించుకున్నట్లు సమాచారం. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించకపోవడం, అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి చెందడంతో రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని తమకు తిరిగి ఇవ్వాలని రేణుకుంట్ల కుటుంబ సభ్యులు రాజలింగమూర్తితో గొడవ పడుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇదే అదనుగా రాజలింగమూర్తి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ విషయమై గురువారం భూపాలపల్లి కోర్టులో విచారణ జరగనుండగా, పథకం ప్రకారం ముందు రోజే హత్య చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
రాజలింగమూర్తి హత్య కేసులో రేణుకుంట్ల కుటుంబానికి చెం దిన ఇద్దరిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న ట్లు తెలిసింది. హత్య జరిగిన స్థలంలో గురువారం క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలం వద్ద సంచిలో ఉన్న కత్తిని పోలీసు లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మిగిలిన వారి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వారి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు కాల్‌డేటాతో విచారణ ముమ్మరం చేశారు.
భూ వివాదంలోనే రాజలింగమూర్తి హత్య జరిగింద ని అతడి భార్య చెప్తున్నా కొందరు కావాలనే ఈ ఘటనను డైవర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కేసును అడ్డం పెట్టుకుని అడ్డగోలు వాదనలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాజలింగమూర్తి పలు భూ వివాదాలతో పాటు అటవీశాఖ డిప్యూటీ ఆర్వో మాధవరెడ్డి, తహసీల్దార్ చక్రధర్, వీఆర్వో జాకీర్ హుస్సేన్‌ను ఏసీబీకి పట్టించాడు. ఓపెన్‌కాస్టు గనులతో పర్యావరణం దెబ్బతింటున్నదని సింగరేణిపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో రిట్ వేశాడు. చెరువు శిఖం భూ ఆక్రమణలపై కేసులు వేశాడు. పలు ఘటనల్లో రాజలింగమూర్తిపై 12 కేసులు నమోదయ్యాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తమ భూమిని దక్కించుకునేందుకు రేణుకుంట్ల కుటుంబ సభ్యులు తన భర్త రాజలింగమూర్తిని చంపారని మృతుడి భార్య సరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ భూమి విషయమై రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయని, దౌర్జన్యంగా తమ భూమిని కాజేసేందుకు యత్నిస్తుండగా తాము సివిల్ కోర్టుకు వెళ్లామని, తమకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని భావించి హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తను చంపితే ఎవరూ అడ్డుండరని, భూమిని దక్కించుకోవచ్చని ఈ దారుణానికి ఒడిగట్టారని , రేణుకుంట్ల సంజీవ్ (భూపాలపల్లి), పింగిళి శ్రీమంత్ అలియాస్ బబ్లూ (పెద్దతూండ్ల), మోరె కుమార్ (కొంపెల్లి), కొత్తూరి కుమార్ (భూపాలపల్లి) రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి కత్తులు, గొడ్డళ్లతో హత్యచేశారని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సరళ పోలీసులను కోరింది. కాగా, సరళ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ నరేశ్ తెలిపారు.