మారుమూల ప్రాంతంలో పుట్టి దేశం గర్వించే చంద్రయాన్-3 సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించి సత్తాచాటారు ఓరుగల్లు బిడ్డలు. సర్కారు బడిలో ఓనమాలు దిద్ది ఇంజినీరింగ్ చేసి మట్టిలో మాణిక్యంలా మెరిసిన ఈ యువ సైంటిస్టులు గగన విజయంలో తమ వంతు కృషిచేశారు. 12మంది ఉండే కమ్యూనికేషన్ విభాగంలో భూక్య రమేశ్, బానోత్ రమేశ్, సీనియర్ మెకానికల్ ఇంజినీర్‌గా పిక్కల కరుణాకర్ కీలకంగా పనిచేసి ‘మిషన్’ సక్సెస్‌లో పాలుపంచుకున్నారు. ప్రపంచమే అబ్బురపడేలా భారత్ సాధించిన గొప్ప కార్యంలో తమ కుమారులు ఉన్నందుకు వారి తల్లిదండ్రులతో పాటు తండావాసులు సంబురపడుతున్నారు. ప్రతి ఒక్కరు తమ కుమారుల గురించి చెప్పుకోవడంతో మురిసిపోతున్నారు.
మహబూబాబాద్ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య లక్ష్మి-భీముడు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. పెద్ద కుమారుడు అమర్సన్ తండాలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండో కుమారుడు దేవులాల్ కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇక మూడో కుమారుడే ఇస్రో యువ సైంటిస్ట్ రమేశ్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిది వరకు గూడూరు ప్రభుత్వ హాస్టల్లో 9,10వ తరగతి మానుకోటలో, ఇంటర్ హనుమకొండలో పూర్తిచేశాడు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా(ఈసీఈ) పూర్తిచేసి ఐస్రోలో కొలువు సంపాదించాడు. నాలుగేళ్లుగా అక్కడి కమ్యూనికేషన్ విభాగంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. చంద్రయాన్-3 విజయవంతం చేయడంలో 1000మంది టీమ్‌లో భూక్య రమేశ్ ఒక్కరు కావడం విశేషం. కమ్యూనికేషన్ విభాగంలోని 12మంది టీమ్‌లో ఒకరిగా ఉంటూ కమ్యూనికేషన్‌కు అనుబంధంగా సేఫ్ లాండ్ చేయడం, సమాచారం చేరవేయడంలో కీలక పాత్ర వహించారు. రమేశ్ ఇక్కడివాడే కావడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ శివారు కస్నాతండాకు చెందిన బానోత్ రమేశ్ అనే యువ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఏడేళ్లుగా ఇస్రోలో కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి రమేశ్ శాస్త్రవేత్తగా ఎదిగారు. చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రయోగ సందర్భాల్లో ఇస్రోలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రయాన్-3 విజయవంతం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
ములుగు జిల్లాకు చెందిన పిక్కల కరుణాకర్ ఆరేళ్లుగా ఇస్రో లో సీనియర్ మెకానికల్ ఇంజినీర్ గా సేవలందిస్తున్నారు. ఈయన స్వస్థలం వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామం, తల్లిదండ్రులు పిక్కల కొమురు-రాజమ్మ. వారికి కరుణాకర్ మూడో కుమారుడు. 2017లో ఇస్రోలో ఇంజినీర్‌గా చేరి చంద్రయాన్-3 విజయవంతంలో తన వంతు పాత్ర పోషించాడు. రాకెట్ ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టింగ్ లాంచ్ ప్యాడ్ ఆపరేషన్ అండ్ మొయింటనెన్స్ విభాగంలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడానికి తన వంతు కృషిచేశానని కరుణాకర్ తెలుపగా మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడం, అందులో మా కొడుకు ఉండ డం చాలా గర్వంగా ఉంది. గత రాత్రి నుంచి ఎంతోమంది మా కొడుకు గొప్పతనం గురించి మాట్లాకుంటూ మా ఇంటికి వచ్చి మాతో చెప్పడం ఎంతో సంతోషం అనిపించింది. రమేశ్ మా కడుపులో పుట్టడం మా అదృష్టం. చిన్నప్పటి నుంచి చదువంటే ప్రత్యేక శ్రద్ధ. అతడి ఇష్టం ప్రకారమే పైచదువులు చదివించాం. దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నందుకు మా కుటుంబసభ్యులు అందరు ఆనందంగా ఉన్నాం. దేశం కోసం రమేశ్ ఇంక మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నాం.
– లక్ష్మి-భీముడు, భూక్య రమేశ్ తల్లిదండ్రులు
భూక్య రమేశ్ వల్ల నేడు మా సోమ్లాతండాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చంద్రయాన్-3 విజయవంతంతో పాటు రమేశ్ తండా గురిం చి చెప్పడం ఎంతో సంతో షం అనిపించింది. రమేశ్ ఒక పద్ధతిగా ఉండి కష్టపడడం వల్లే ఈ సువర్ణావకాశం వచ్చింది. తండా యువత రమేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. పాఠశాల నుంచే చదువుపై శ్రద్ధ పెట్టాలి. దేశ అభివృద్ధికి ఎంతో కొంత సాయం చేయాలి. విద్యార్థులు, యువత చెడు వైపు మళ్లుకుండా దేశ సమైక్యతను కాపాడాలి. సరికొత్త భావాలతో రమేశ్‌లా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అప్పుడే సమాజంలో మంచి పేరు వస్తది.
– ఇస్లావత్ బాలాజీ నాయక్, సోమ్లాతండా సర్పంచ్