వర్ధన్నపేట, ఫిబ్రవరి 12 : అంతరించిన పోతున్న నాటక రంగానికి భారతీయ నాటక కళాసమితి జీవం పోస్తున్నది. అనేక మంది కళాకారులకు వేదికగా వర్ధన్నపేట భారతీయ నాటక కళాసమితి నిలిచింది. కళాకారులు 48 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖుల ఆశీస్సులతో వర్ధన్నపేట కళాసమితిలో నాటికలను ప్రదర్శిస్తున్నారు. 1974లో మండలంలోని ఇల్లందలో పలువురు కళాకారులు భారతీయ నాటక కళాసమితిని ప్రారంభించారు. అనంతరం 1980లో నాటి తాలుకా కేంద్రమైన వర్ధన్నపేటకు కళాసమితిని మార్చి ప్రదర్శనలిస్తున్నారు.
కొత్తపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు మునుగోటి నర్సయ్య రూ.లక్ష విరాళంగా అందించడంతో ఆనాటి కళాసమితి అధ్యక్షుడు ఈగ శ్రీహరి ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఆకేరువాగు ఒడ్డున స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థానిక కళాకారులు చందాల రూపంగా నిధిని సేకరించి ఆడిటోరియాన్ని నిర్మించుకున్నారు. నాటి నుంచి నిరాటంకంగా ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. పూర్వ ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాత కళాసమితిలకు చెందిన కళాకారుల బృందాలను ఆహ్వానించి నాటికలను ప్రదర్శిస్తున్నారు.
మహాశివరాత్రికి రాష్ట్రస్థాయి పోటీలు
సుమారు ఐదు దశాబ్దాలుగా పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల స్థాయిలో కళాకారులను ఆహ్వానించి నాలుగు రోజులపాటు నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు సినీ ప్రముఖులను ఆహ్వానించి కళాకారులను సత్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే 1980లో దివంగత సినీనటి జమునను ఆహ్వానించడంతో పాటు ఏటా ప్రముఖ కళాకారులను ఆహ్వానించారు. తెలంగాణ శకుంతల, కోటా శ్రీనివాస్‌రావు, బాబుమోహన్, ఆర్పీ పట్నాయక్, జయప్రకాశ్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరై కళాప్రదర్శనలు ప్రారంభించారు. ప్రముఖులు సైతం భారతీయ నాటక కళాసమితి వేదికపై నాటికలను ప్రదర్శించారు.
రాష్ట్ర స్థాయి నాటికల పోటీలకు నిర్వాహకుల ఏర్పాట్లు
మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 49వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలను ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కళాసమితి ప్రతినిధులు సిలువేరు కుమారస్వామి, సంజీవరావు, మాశెట్టి సోమయ్య తెలిపారు. మొదటి రోజు తెలంగాణ ఐక్యవేదిక వరంగల్ వారిచే ‘కనువిప్పు’ నాటిక, 2వ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘అతీతం’ నాటికలు ప్రదర్శించనున్నారు. 15న మయూరి ఆర్ట్స్ వరంగల్ వారిచే ‘ఉన్నది ఒకటే జీవితం’, 2వ ప్రదర్శనగా ‘రాజరాజ చోరులు’ నాటికలు ప్రదర్శించనున్నారు. 16న 1వ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్ కొలుకలూరు వారిచే ‘ప్రేమతో నాన్న’, 2వ ప్రదర్శగా జాబిలి కల్చరల్ సొసైటీ నిజామాబాద్ వారిచే ‘అసురవేదం’, 17న 1వ ప్రదర్శన ‘ప్రేమతో నాన్న’, 2వ ప్రదర్శనగా మద్దుకూరి ఆర్ట్స్ చిలకలూరిపేట వారిచే ‘మృత్యుపత్రం’, 18న ప్రత్యేక ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ వారిచే ‘చీకటి పువ్వువ్వు’ నాటిక ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా 18వ తేదీ రాత్రి ప్రత్యేక సాంసృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.