నాయకులను తయారు చేసే రాజకీయ ఫ్యాక్టరీగా భారత రాష్ట్ర సమితి నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన బీఆర్ఎస్లో ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచీ కొత్త నాయకత్వం పుట్టుకువస్తున్నది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రతి సందర్భం లోనూ కొత్త వారికి అవకాశం ఇస్తున్నది. వేల సంఖ్యల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయ కత్వాన్ని తయారుచేసింది. కొందరు పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినా.. సొంత బలంతో మళ్లీ నేతలను తయారుచేస్తూనే ఉన్నది. స్వార్థం కోసం ఉద్యమ పార్టీకి ద్రోహం చేసి కొందరు పార్టీలు మారినా బీఆర్ఎస్ ప్రతి సారి నూతన బలాన్ని కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నది.
2001లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఆవిర్భావంతోనే కొత్త నేతలు తయారయ్యే ప్రక్రియ మొదలైంది. ఉద్యమ కాలంలో విద్యార్థి, రైతు, కార్మిక, న్యాయవాదుల నుంచి పలువురు ముఖ్యమైన నేతలు తయారయ్యారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు వేల మంది వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మరికొందరు ఉద్యమకారులు ప్రభుత్వంలో ఇతర పదవులు పొందారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కొత్త రాజకీయ చరిత్రను సృష్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన వారిలో అత్యధిక మంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులుగా తొలిసారి ఎన్నికయ్యారు. అదే ఏడాది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ వందల మంది కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచారు. 2001 నుంచి ఇటీవలి వరకు ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున కొత్త నేతలు ఎన్నికవుతూనే ఉన్నారు. రాజకీయంగా అనుభవం ఉన్న కొందరు పార్టీలోకి వచ్చినా గులాబీ పార్టీ నుంచే తొలిసారి ఎంపీలుగా, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గ్రామ స్థాయిలో ప్రస్తుతం ఉన్న కీలక నాయకులు అంతా మొదట బీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన వారే.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలిసారిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన పలువురు ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతంలో కొద్దిపాటి రాజకీయ నేపథ్యం ఉన్నా బీఆర్ఎస్ నుంచి తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన వారు ఎందరో ఉన్నారు. న్యాయవాదిగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ తొలిసారి బీఆర్ఎస్ తరఫున హనుమకొండ ఎంపీగా గెలి చారు. ఆ తర్వాత 2008 ఉపఎన్నికల్లోనూ విజయం సాధించారు. అదేవిధంగా దాస్యం వినయ్‌భాస్కర్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వీ సతీశ్ కుమార్ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. బీఆర్ఎస్తోనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు అనేక మంది ఉన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ గద్దల పద్మ, జడ్పీ అధ్యక్షులు ఎం.సుధీర్‌కుమార్, పాగాల సంపత్‌రెడ్డి, కుసుమ జగదీశ్, అంగోతు బిందు, జక్కు శ్రీహర్షిణి, బడే నాగజ్యోతి తొలిసారి ఎన్నికల్లో గెలిచారు. వీరిలో బడే నాగజ్యోతి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ములుగు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
విద్యార్థి నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఉద్య మకారులు బోయినపల్లి రంజిత్, బోడ డిన్న తొలిసారి బీఆర్ఎస్ నుంచే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్లుగా గెలిచారు. విద్యార్థి నాయకుడు కే వాసుదేవారెడ్డికి బీఆర్ఎస్ రాష్ట్ర చైర్మన్‌గా అవకాశం కల్పించింది. ఉద్యమ నాయకులు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజు యాదవ్‌కు పార్టీ కుడా చైర్మన్ పదవి ఇచ్చింది. బీఆర్ఎస్ తరఫున అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలో చేరినా గులాబీ పార్టీ ఎప్పుడూ బలం కోల్పోలేదు. పార్టీలోని మరింత మంది కొత్త నేతలుగా తయారయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావంలో కొత్తగా వచ్చిన పసునూరి దయాకర్ వరంగల్ ఎంపీగా గెలిచారు. రవీంద్రనాయక్ బీఆర్ఎస్ నుంచి తొలిసారి ఎంపీగా ఇదే స్థానంలో గెలిచారు. 2004లో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల ఎమ్మెల్యేగా, బండారి శారారాణి పరకాల ఎమ్మెల్యేగా, కే లక్ష్మారెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా, దుగ్యాల శ్రీనివాస్‌రావు చెన్నూరు ఎమ్మెల్యేగా, మందాడి సత్యనారాయణరెడ్డి హనుమకొండ ఎమ్మెల్యేగా తొలిసారి బీఆర్ఎస్ నుంచే ఎన్నికై ఆ తర్వాత ఇతర పార్టీల్లోకి మారారు. బీఆర్ఎస్ ఇచ్చిన అవకాశాలతో ఉన్నత పదవులు పొందిన వారిలో ఎందరు పార్టీలు మారినా గులాబీ పార్టీ ఎప్పటికప్పుడు మరింత పటిష్ట నాయకత్వంతో ముందుకు సాగుతున్నది.