ములుగు, జూన్ 7(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో విలీనమైంది. ఇప్పటి వరకు ఇది వైద్యా విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలందించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ములుగు జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన స్థాయి రోజు రోజుకు పెరుగుతున్నది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందే అవకాశం లభించింది.
20 ఏళ్ల క్రితం ఒక వైద్యాధికారి, 30 పడకలతో కొనసాగిన ప్రభుత్వ దవాఖాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ కృషితో 100 పడకల దవాఖానగా మారింది. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో ఇక్కడి దవాఖాన దానికి అనుబంధంగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీ ప్రారంభమై మొదటి బ్యాచ్‌లో 50 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా ఈసారి మరో 50 మంది ప్రవేశాలు పొందనున్నారు.
దీంతో మెడికల్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం ఈ దవాఖానను జనరల్ ఆస్పత్రిగా స్థాయిని పెంచి మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి బదిలీ చేసింది. మూడు రోజులుగా ఉద్యోగులు, వైద్య సిబ్బంది బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించిన డాక్టర్ జగదీశ్వర్ డీసీహెచ్ సూపరింటెండెంట్‌గా కొనసాగనున్నారు. జనరల్ దవాఖాన సూపరిండెంట్‌గా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ మోహన్‌లాల్ నియమితులయ్యారు.
మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానగా ములుగు ఆస్పత్రిని మార్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన మేర వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో అరకొర సేవలందుతున్నట్లు తెలుస్తున్నది. గతంతో పోల్చితే ఓపీతో పాటు ఐపీ సేవ లు రెండితలు పెరిగాయి. సగటున రోజుకు 650మంది ఓపీ వైద్య సేవలు పొందుతుండగా ఇన్పెషెంట్లుగా 150 మంది చేరుతున్నారు. మాతా శిశు సంబంధిత సేవలు, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్‌డీ, కంటి, ఆర్థో, ఇతర విభాగాలు కలపుకొని మొత్తం 14 స్పెషలిస్టు సేవలు అందుతున్నాయి. ల్యాబు ల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోతున్నా యి.
మెడికల్ కాలేజీలో 12 మంది ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహిస్తుండగా వీరంతా ములుగు దవాఖానలో వైద్య సేవలందించేందుకు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీఆర్మ్ యంత్రం నెలకొల్పగా గత ప్రభుత్వ హయాంలో సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టెక్నిషియన్లు, అర్హత గల వైద్యాధికారులు లేకపోవడంతో రిపోర్టులు అందించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది తిరిగి కాంట్రాక్టు ప్రాతిపదికన దవాఖానలో చేరి ఇష్టారీతిగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి.