కమలాపూర్, ఆగస్టు 12 : డబుల్ బెడ్ రూం ఇళ్లు మంత్రులు ప్రారంభించి మూడు రోజులైనా పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదు?, లబ్ధిదారుల పేర్లు ప్రకటించడంలో ఎందుకు ఆలస్యమవుతు న్నది?, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలో మార్పు చేర్పుల కోసమే పంపిణీ ఆగిందా.. అనే చర్చ జరుగుతోంది. కమలాపూర్ మండలంలో ఈ నెల 10న రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కమలాపూర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి ముగ్గురు లబ్ధిదారులకు పట్టాలు అందజేసి వెళ్లిపోయారు. కమలాపూర్‌లో 302, గూ డూరు 50, మర్రిపెల్లిగూడెం 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి లబ్ధిదారుల జాబితా తయారుచేసిన అధికారులు మూడు రోజులైనా ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. మంత్రులు ఆదేశించినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే భయం లబ్ధిదారుల్లో నెలకొంది.
డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాల పంపిణీకి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లే కారణమా? స్థాని క నాయకులు గ్రూపులుగా విడిపోయి తామిచ్చిన జాబితా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో లిస్టును ప్రకటించడంలో అధికారులు జంకుతున్నారు. ఇండ్లు ఇప్పిస్తామని వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జాబితాలో ఎవరి పేర్లు వస్తాయోననే లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.