కృష్ణకాలనీ, నవంబర్ 27 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు పట్టాలిచ్చేంత వరకు కదిలేది లేదంటూ భూపాలపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. కమిటీ పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు భాస్కర్గడ్డలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద టెంట్ వేసుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నూతి రమేశ్, తాటికొండ సమ్మక, బండి కుమార్ మాట్లాడుతూ ఏడాదిగా రేపు, మాపు అంటూ పట్టాలివ్వకపోవడంతో విసిగిపోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కొందరు గిట్టని వారు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పట్టాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్కు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, మళ్లీ సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పట్టించుకోవడం లేదన్నారు. తాము ఇండ్ల కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత జూన్లో నిర్వహించిన ధర్నాతో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్రావు, అధికార పార్టీకి చెందిన సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీని ఎమ్మెల్యే వేశారని, వారు పరిశీలించి అర్హులందరికీ పట్టాలిస్తామని చెప్పారని తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నారు. కార్యక్రమంలో లావుడ్యా మధుకర్ నాయక్, ఐలాపురం స్వప్న, సుష్మ, తిరుమలతో పాటు మరో 30 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.