నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన భర్త కట్టుకున్న భార్యతో పాటు తనయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన నిడిగొండ కోటిలింగం-విజయ దంపతులకు కుమారుడు, కూతురు. కుమార్తె వివాహం జరిపించారు. బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం కోటిలింగం కుటుంబం హైదరాబాద్కు వెళ్లింది. ఈ క్రమంలో కొంతకాలంగా భార్య విజయపై కోటిలింగం అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. దీంతో తరచూ భార్య, కుమారుడితో గొడవపడి వారిని కొట్టేవాడు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు.
అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఏడాదిన్నరగా కోటిలింగం, విజయ హైదరాబాద్లో వేర్వేరు ఇళ్లలో ఉంటూ అక్కడే పని చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల మళ్లీ గొడవలు జరుగుతుండడంతో కోటిలింగం చంద్రయ్యపల్లికి చేరుకున్నాడు. సోమవారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహిస్తుండగా భార్య విజయ గొంతుపై, కుమారుడు ప్రవీణ్ చాతి, కడుపులో కోటిలింగం కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు నర్సంపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేశారు. విజయ, ప్రవీణ్ చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సురేశ్ ఘట నా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు కోటిలింగం పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.