హనుమకొండ, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గట్టేక్కేందుకు కాంగ్రెస్‌పార్టీ ఆపసోపాలు పడుతున్నది. సంక్షేమం, అభివృద్ధిని కాకుండా ఆశావహుల ఆర్థిక, అంగబలాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నది. పార్టీలో ఏండ్లుగా పనిచేసి, పలుకుబడి ఉన్న నేతలను కాదని, ఆర్థికస్థోమత ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నది. తాము చెప్పినంత మొత్తాన్ని చెప్పిన వారి వద్ద ముందుగానే డిపాజిట్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కండిషన్లు పెడుతుండడంతో ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకొని ఉన్న అసలు కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఆందోళన చెందుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచిపోయి తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. ప్రజలను మరోసారి మోసం చేసేలా తాత్కాలిక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నది. అభివృద్ధిని కాకుండా ఆర్థిక బలంతోనే ఎన్నికల్లో గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలో కీలకంగా ఉంటున్న వారికి కాకుండా డబ్బులున్న వారికే అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్నది. పార్టీలో పని చేయడం అర్హత కాకుండా ఎక్కువ డబ్బులనే ప్రామాణికంగా తీసుకుంటున్నది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకున్న వారికే టికెట్లు అనే పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పైసలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ పరిస్థితితో కాంగ్రెస్‌లోని అసలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, పరకాల, ములుగు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహం కోసం కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతున్నది.
లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒకరు చొప్పున మంత్రులను ఇన్చార్జిలుగా నియమించింది. వీరి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షులతో కమిటీలను ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈ కమిటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే వార్డుల వారీగా ఆశావహుల పేర్ల సేకరణ ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ టికెట్ ఆశించే వారు దరఖాస్తు చేసుకోవాలని మౌఖికంగా సమాచారం ఇచ్చారు. ఆర్థికంగా ఉన్నవారికి, తమకు నచ్చిన వారికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమాచారం చెబుతున్నారు.
మంత్రుల కమిటీకి డబ్బులున్న వారి పేర్లను మాత్రమే పంపేలా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంత్రుల కమిటీకి పేర్లు పంపాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెప్పిన వారి వద్ద ముందుగానే డిపాజిట్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆశావహులకు కండిషన్లు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎజెండాగా ప్రచారం నిర్వహించాల్సిన అధికార పార్టీ మొదటి నుంచి ఆర్థిక బలంతోనే గెలిచేలా ప్రయత్నాలు చేస్తున్నది.
వార్డుల వారీగా టికెట్ ఆశించే వారిలో ఎక్కువ డబ్బులున్న వారి పేర్లను మంత్రుల కమిటీకి పంపేలా ఎమ్మెల్యేలు సొంతంగా జాబితాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆశావహుల మధ్య పోటీని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతారో ముందుగానే చెప్పాలని షరతులు పెడుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా ఆర్థికంగా ఉన్న వారికి టికెట్లు కేటాయించేలా, మిగిలిన వారిని తప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. రిజర్వేషన్లను బట్టి ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎరగా చూపుతూ అధికార పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు టికెట్ల కేటాయింపులోనూ ఆర్థికంగా తమ లాభాలను చూసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పట్టించుకోవడంలేదు. బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతి పథకం కింద చేపట్టిన అభివృద్ధి తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పనులు చేయలేదు. తాగునీటి సరఫరాను పట్టించుకోవడంలేదు. మౌలిక వసతుల కల్పన, రహదారులు, కరెంటు సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పట్టణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ.., అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదు. యూరియా కొరతతో రైతులు వానకాలంతో ఇబ్బంది పడ్డారు. యాసంగిలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులకు ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రాష్ట్రంలో కొత్తగా ఒక్కరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, బోదకాల బాధితులు ఆసరా పెన్షన్ల కోసం రెండేండ్లుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గాలను కనీసం పట్టించుకోవడంలేదు.
మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని మరిచిపోయింది. యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించి పక్కనబెట్టింది. పేద కుటుంబాలకు రూ.500కు గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు(గృహజ్యోతి) పథకాలను అరకొరగానే అమలు చేస్తున్నది. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన విద్య, భోజనం వసతి ఉండడంలేదు.