రాయపర్తిలోని ఎస్బీఐలో చోరీ జరిగి రెండు నెలలైనా పోలీసులు కేసును ఛేదించలేకపోతున్నారు. సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లగా, 15 రోజుల్లో దొంగల ఆచూకీని తెలుసుకుని ముగ్గురిని పట్టుకుని 2.520 కిలోల నగలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు కీలక నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకోవడంలో, సొత్తును రికవరీ చేయడంలో పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగల కోసం బాధితులు నిత్యం బ్యాంకు చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
– సుబేదారి, ఫిబ్రవరి 2
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయపర్తి ఎస్బీఐలో గత నవంబర్ 18 అర్ధరాత్రి అంతర్ రాష్ట్ర దొంగల ముఠా చోరీకి పాల్పడి సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పది ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేయగా, పదిహేను రోజుల్లోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్షాద్ అన్సారీ, షాఖీర్‌ఖాన్, హిమాన్షును పట్టుకున్నాయి.
డిసెంబర్ 6న సీపీ ముగ్గురు దొంగల అరెస్ట్, 2.520 కిలోల బంగారు ఆభరణాలు, కారు, రూ. పదివేల నగదు రికవరీ చూపించారు. తర్వాత మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకోవడం పోలీసు అధికారులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు మిగతా దొంగలను పట్టుకోవడానికి బయటి రాష్ర్టాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలే సొంతంగా డబ్బులు సమకూర్చుకోవాల్సి ఉండడంతో అక్కడి వెళ్లడానికి వెనకడుగు వేయడానికి ఇదొక కారణమని ఓ పోలీసు అధికారి చెప్పాడు.
కాగా, ఈ చోరీలో గోల్డ్‌కు సంబంధించిన బాధితుల్లో ఎక్కువ మంది బ్యాంకులో గోల్డ్ కుదువబెట్టి రుణాలు తీసుకున్నవారే ఉన్నారు. మిగతా నిందితులను అరెస్ట్ చేయకపోవడం, 90 శాతం సొత్తు రికవరీ చేయకపోవడంతో కేసు విచారణ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో స్థానిక పోలీసులు చార్జిషీట్ కోర్టులో దాఖలు చేయకపోవడంతో బాధితులకు రావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ జాప్యం జరుగుతున్నదని బాధితలు ఆందోళన చెందుతున్నారు.
దొంగల ముఠాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దొంగలతోపాటు కారు డ్రైవర్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారు. ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరిలో ముంబైకి చెందిన ఇద్దరు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో దొంగ ఉన్నాడు. వీరి వద్దనే రికవరీ కావాల్సిన మొత్తం బంగారం ఉందని చెబుతున్నారు. దోపీడీ జరిగిన రెండు నెలలు దాటినా ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు.