ఐనవోలు, జూన్ 15 : తను సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో వేసిన మక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదని ఓ కౌలు రైతు ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి శ్రీను ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మూడు మక్కజొన్న విత్తనాల బస్తాలను మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్‌లో రూ. 4500కు కొనుగోలు చేసి వెంకటాపురం శివారులో 1.20 ఎకరాల భూమిలో విత్తాడు. 13 రోజులు గడిచిన తర్వాత సుమారు 10 శాతం విత్తనాలు ఐదు ఫీట్లకు ఒక మొక్క చొప్పున మొలకెత్తాయి.
కంపెనీ నిర్వాకంతో ఇప్పటి వరకు పెట్టిన రూ.25,000 వరకు పెట్టుబడిని నష్ట పోయాడు. తన భూమిలోనే కాకుండా ఆ కంపెనీ విత్తనాలు చుట్టు పక్కల రైతు భూముల్లో కూడా మొలకెత్తలేదని, తనను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఈ విషయమై ఏవో అడుప కవితను వివరణ కోరగా తన దృష్టి వచ్చిందని, తాను సెలవులో ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ సదరు రైతు వివరాలు కనుక్కొని ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదన్నారు. విత్తనాలు విక్రయించిన డీలర్‌ను రైతు వద్దకు పంపించానని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా పడలేదని, భూమిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో మొక్కలు మొలకెత్తలేదన్నారు. ముందుగా విత్తనాలు వేసిన భూమికి నీరు పెట్టాలని సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సరిపడా నీళ్లు పెట్టిన మూడు, నాలుగు రోజుల తర్వాత కూడా విత్తనాలు మొలకెత్తకపోతే సదరు విత్తనాల నమూనాను ల్యాబ్‌లో పరీక్షించి, వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు.